Andhra Pradesh: ప్రవాస భారతీయుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి కొల్లు రవీంద్ర

  • కువైట్ ప్రభుత్వ ఆమ్నెస్టీతో సుమారు 5,000 మంది ప్రవాసాంధ్రులు స్వరాష్ట్రానికి పయనమయ్యారు
  • ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కువైట్ వెళుతున్నాం
  • విలేకరులతో మంత్రి కొల్లు రవీంద్ర

ప్రవాస భారతీయుల అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఏపీ న్యాయ, యువజన, క్రీడలు, ప్రవాసాంద్రుల సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కువైట్ నుండి ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ద్వారా తిరిగి వచ్చిన ప్రవాసులకు సహాయ సహాకారాలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను, అధికారులు కువైట్ కు వెళ్లనున్నామని, మూడురోజుల పాటు దుబాయ్ లో ఉంటామని చెప్పారు.  

కువైట్ ప్రభుత్వ ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) తో సుమారు 5,000 మంది ప్రవాసాంధ్రులు స్వరాష్ట్రానికి వస్తున్నారని, వీరిలో అధిక శాతం కడప, ఉభయ గోదావరి, చిత్తూరు జిల్లాలకు చెందిన చిరు ఉద్యోగులు ఉన్నారని వివరించారు. జీవనోపాధి కోసం కువైట్ కు వెళ్ళి, అక్కడ చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడి చట్టాలు తెలియక, ఫైన్ లు కట్టలేక కువైట్ లో అనధికారికంగా బ్రతుకుతున్న ప్రవాసులు ఎటువంటి అపరాధ రుసుములు చెల్లించకుండా స్వదేశానికి వెళ్ళవచ్చంటూ కువైట్ ప్రభుత్వం ఆమ్నెస్టీ ప్రకటనను జారీ చేసిందని చెప్పారు.

కువైట్ ప్రభుత్వ ప్రకటనను వినియోగించుకుని వేలాది మంది ప్రవాసులు స్వదేశానికి తిరుగు పయనమయ్యారని, ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడతల వారీగా కలిసి వివరించడం జరిగిందని చెప్పారు. ఈ విషయంపై తక్షణం స్పందించిన చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ఉన్న వారిని ఆదుకోవాల్సిందిగా కోరుతూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాయడం జరిగిందని అన్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సమాధానం రానందున, కేవలం మూడు రోజులే ఆమ్నెస్టీ గడువు ఉండటంతో కువైట్ కు వెళ్లి తక్షణం ఆదుకోవాల్సిందిగా చంద్రబాబు ఆదేశించారని కొల్లు రవీంద్ర చెప్పారు..

ఆమ్నెస్టీతో కువైట్ నుండి తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రులకు తక్షణ వెసులుబాటు కార్యక్రమాలు చేపట్టమని  ఏపీఎన్నార్టీకి ఆదేశాలు జారీ చేశామని, ముఖ్యమంత్రి ఆదేశానుసారం తాను, తన శాఖ అధికారులు ఈరోజు రాత్రి బయలుదేరి కువైట్ కు 20 వ తేదీన చేరుకుంటామని అన్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి, కువైట్ లో మిగిలిపోయిన తెలుగు వారికి అవసరమైన చేయూతనిస్తామని తెలిపారు. ప్రవాసాంధ్రులకు తక్షణ వెసులుబాటు కల్పనలో భాగంగా ఏపీ ఎన్నార్టి సొసైటీ, కువైట్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన వారిని నిలబెట్టే విధంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా మెరుగైన నైపుణ్యాభివృద్ది శిక్షణను, సరిక్రొత్త నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాన్నికల్పిస్తున్నట్టు తెలిపారు.

ఈ శిక్షణా తరగతులకు హాజరైన ప్రవాసాంధ్రులకు మూడు నెలల పాటు జీవన భృతి అందించనున్నామని,  ప్రవాసాంధ్రులు అధికంగా ఉన్న ప్రాంతాలలో జాబ్ మేళా లను నిర్వహించాలని ఏపీఎస్ఎస్డీసీని  ముఖ్యమంత్రి ఆదేశించారని అన్నారు. వీటితో పాటు కువైట్ నుండి తిరిగి వచ్చిన వారికి మరిన్ని ఉచిత శిక్షణలు ఇచ్చి స్వయంగా జీవనోపాధి కల్పనకు పలు రాయితీల ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. కువైట్ నుండి తిరిగి వచ్చిన ప్రవాసాంధ్రులు మరిన్ని వివరాల కోసం, రిజిస్ట్రేషన్ కొరకు  ఏపీఎన్నార్టి హెల్ప్ లైన్ నంబర్ 00 91 863-2340678 కు ఫోన్ ద్వారా, 00 91 85000 27678 నంబర్ కు వాట్సప్ ద్వారా, లేదా www.apnrt.com/kuwait అనే వెబ్ సైట్ ద్వారా సంప్రదించవచ్చునని  కొల్లు రవీంద్ర తెలిపారు.

More Telugu News