mumbai: హైపర్ లూప్ సాంకేతికత.. ఇకపై ముంబై టూ పూణె ఇరవై నిమిషాల్లో వెళ్లొచ్చు!

  • టెస్ట్ ట్రాక్ నిర్మాణం 2019 లో ప్రారంభం
  • అది విజయవంతమైతే  2021 నాటికి  ముంబై - నవీ ముంబై - పూణె మధ్య ట్రాక్ పూర్తి అవుతుంది
  • దాదాపు రూ.20,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా

ఇకపై ముంబై టూ పూణె కు కేవలం 20 నిమిషాల్లో వెళ్లొచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వానికి, అమెరికాకు చెందిన వర్జిన్ హైపర్ లూప్ వన్ కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం, గ్రౌండ్ లెవెల్ మార్గాల్లో అధునాతన సాంకేతిక రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఈ సాంకేతికత ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణించే సమయం మూడు గంటల నుంచి ఇరవై నిమిషాలకు తగ్గనుంది.

రెండు ప్రాంతాల మధ్య మార్గం అనుకూలతలను పరిశీలించే నిమిత్తం ప్రస్తుతం కొన్ని బృందాలు పని చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన నివేదిక ఆరు నెలల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ రవాణా వ్యవస్థ కనుక అమల్లోకి వస్తే గ్రౌండ్ లెవెల్ మార్గాల్లో చౌక రవాణా వ్యవస్థగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. టెస్ట్ ట్రాక్ నిర్మాణం 2019లో ప్రారంభిస్తామని, అది విజయవంతమైతే 2021 నాటికి ముంబై- నవీ ముంబై- పూణె మధ్య ట్రాక్ పూర్తి చేస్తామని చెబుతున్నారు.

ఈ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు దాదాపు రూ.20,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని అన్నారు. ఈ రవాణా వ్యవస్థ వల్ల ప్రతి సంవత్సరం 150 మిలియన్ల మంది ప్రయాణించే అవకాశముంటుందని, ప్రమాదాలు తగ్గుముఖం పడతాయని, గ్రీన్ హౌస్ వాయువులను తగ్గించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. జాతీయ హైపర్ లూప్ సాంకేతికలో ముంబై - పూణె మార్గం మొదటి కారిడార్ కానుందని అన్నారు. కాగా, నిన్న ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వానికి, అమెరికా సంస్థ వర్జిన్ హైపర్ లూప్ వన్ కంపెనీకి మధ్య ఒప్పందం కుదిరింది. 'మాగ్నెటిక్ మహారాష్ట్ర' సమావేశంలో భాగంగా ప్రధాని మోదీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, వర్జిన్ హైపర్ లూప్ వన్ సంస్థ చైర్మన్ రిచర్డ్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

హైపర్ లూప్ రైలు గురించి చెప్పాలంటే.. ఇది ధ్వని వేగంతో దూసుకుపోతుంది. ఒక క్యాప్యూల్స్ లాంటి నిర్మాణంలో ప్రయాణికులు ప్రయాణిస్తారు. వాణిజ్యపరంగా చూస్తే దుబాయ్ మినహా ఏ దేశంలోనూ ఇలాంటి వ్యవస్థ అందుబాటులో లేదు.

More Telugu News