Andhra Pradesh: ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ పనిలేదు : సీఎం చంద్రబాబు

  • మన సామర్ధ్యమే మనకు శ్రీరామరక్ష
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పాటుబడాలి
  • నీరు - ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు

‘ఎవరి దయాదాక్షిణ్యాలతోనూ మనకు పనిలేదు. మన సామర్ధ్యమే మనకు శ్రీరామరక్ష. ప్రతి ఒక్కరూ పూర్తి సామర్ధ్యంతో పని చేయాలి’ అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు.  తన నివాసం నుంచి ‘నీరు-ప్రగతి, వ్యవసాయం’ పురోగతిపై ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి. మన కష్టమే మనకు అక్కరకు వస్తుంది. సంక్షోభంలో మరింత సామర్ధ్యంతో పని చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ పాటుబడాలి’ అంటూ దిశానిర్దేశం చేశారు. మన రాష్ట్రావతరణను ఒక వేడుకగా కాకుండా ఒక సంకల్పంగా, ఒక దీక్షగా తీసుకుని కసిగా పని చేస్తున్నామనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని, నవ నిర్మాణ దీక్ష, మహా సంకల్పం నేపథ్యాలను స్ఫురణకు తెచ్చుకోవాలని అన్నారు.

‘విభజన చట్టంలో అంశాలు, అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. మన రాష్ట్రానికి న్యాయం చేయమని ఎంపీలు పార్లమెంటులో పోరాటం చేస్తున్నారు. ఈ స్ఫూర్తిని కొనసాగించాలి. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రజా ప్రతినిధుల పోరాటం, అధికార యంత్రాంగం కృషి రాష్ట్రం ప్రయోజనాల కోసమే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మార్కెట్ జోక్యం కోసం మరింత పటిష్టమైన వ్యవస్థ రావాలి 

‘మార్కెట్ జోక్యం కోసం మరింత పటిష్టమైన వ్యవస్థ తీసుకురావాలి. ప్రతి రైతుకు లాభదాయకమైన ధర లభించే వ్యవస్థ రావాలి. గతంలో కన్నా కౌలు రైతులకు పంట రుణాలు నాలుగైదు రెట్లు అధికంగా ఇచ్చాం. కౌలు రైతుల్లో పూర్తి సంతృప్తి ఉంది. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇప్పటివరకు 78% పంటరుణాలే ఇచ్చారు. రుణాల లక్ష్యం 100% చేరుకోవాలి’ అని చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో పంటలకు ఏ విధమైన తెగుళ్లు సోకకుండా పరిశోధనలు చేయాలని, పండ్ల తోటల సాగు ఎంత పెరిగితే అంత లాభం అంటూ, కోటి ఎకరాల్లో ఉద్యాన సేద్యం జరగాలనేది తమ లక్ష్యమని, సూక్ష్మసేద్యం లక్ష్యం 68% మాత్రమే చేరుకోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

జలసంరక్షణ ఉద్యమం రెండవదశ పనులు ముమ్మరం చేయాలని, చెరువుల పూడికతీత, ముళ్ల కంపల నరికివేత వేగవంతం చేయాలని ఆదేశించారు. మనం ఎక్కడ ఉన్నాం, ఎంత సాధించాం,ఇంకా ఎంత సాధించాలనేది ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని చెప్పారు.
పశుగ్రాసం, సైలేస్, గ్రీన్ పౌడర్, డిఎంఆర్ పంపిణీ చేయాలని, పాల ఉత్పాదకత పడిపోకుండా చూడాలని సూచించారు. పశుగణాభివృద్ధి రంగంలో వృద్ధి ప్రస్తుత లక్ష్యం 15%లో 12.5% మాత్రమే సాధించామని, 20% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకోవాలని చంద్రబాబు చెప్పారు.
 
నిధులు నిలిపివేసే అవకాశమివ్వొద్దు

‘రాబోయే 45 రోజులు నరేగా పనులు ముమ్మరం కావాలి. అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలి, గ్రామాలలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెంపొందాలి. ఉపాధి కూలీలకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలి. ప్రతి పని జియో ట్యాగింగ్ చేయాలి. అన్నింటినీ ఆన్ లైన్ లో పెట్టాలి, పూర్తి పారదర్శకంగా పని చేయాలి. ఏదో ఒక నెపంతోనో, ఎవరో ఒకరి ఫిర్యాదుతోనో నిధులు నిలిపివేసే అవకాశం మనం ఇవ్వొద్దు’ అని చంద్రబాబు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం ముమ్మరం చేయాలని, హౌసింగ్ లో అన్ని జిల్లాలు ‘ఏ’ గ్రేడ్ చేరుకోవాలని, 2017-18, 2018-19 ఇళ్ల కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని, 2016-17లో మంజూరైన ఇళ్లు 100% యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

More Telugu News