India: పరుగుల యంత్రానికి గాయం.. సఫారీలతో తదుపరి టీ20కి దూరం?

  • బ్యాటింగ్ సమయంలో కోహ్లీ చేతిని బలంగా తాకిన బంతి
  • తొడ కండరాలు పట్టేయడంతో 13వ ఓవర్ లో ఫీల్డ్ ను వదిలి వెళ్లిన కోహ్లీ
  • చేతికి గాయం కాలేదు, కాలి గాయం ఇబ్బంది పెడుతోందన్న భారత్ స్కిప్పర్  

పరుగుల యంత్రానికి గాయమైంది. దీంతో సఫారీలతో జరుగనున్న తదుపరి టీ20 మ్యాచ్ కు కోహ్లీ దూరం కానున్నాడా? అన్న అనుమానం టీమిండియా అభిమానుల్లో నెలకొంది. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నిన్న జరిగిన టీ20 మ్యాచ్ లో గాయపడ్డాడు. మూడవ నంబర్ బ్యాట్స్ మన్ గా క్రీజులో బ్యాటింగ్ కు దిగిన కోహ్లీ (26) ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్ సందర్భంగా బౌలర్ వేసిన బంతి కోహ్లీ చేతిని బలంగా తాకింది. చేయినొప్పితోనే బ్యాటింగ్ చేసిన కోహ్లీ, ఆ తరువాత ఫీల్డింగ్ కూడా చేశాడు.

తర్వాత మ్యాచ్ మధ్యలో కాలి తొడకండరాలు పట్టేయడంతో ఫీల్డింగ్ చేయలేక 13వ ఓవర్ లో ఫీల్డ్ ను వదిలి వెళ్లాడు. ఈ క్రమంలో మ్యాచ్‌ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ‘అదృష్టవశాత్తూ చేతికి ఎలాంటి గాయం అవ్వలేదు. కాలి గాయం కాస్త ఇబ్బంది పెడుతోంది’ అని పేర్కొన్నాడు. దీంతో కోహ్లీ తదుపరి టీ20 మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడా? ఉండడా? అన్న అనుమానం నెలకొంది. సిరీస్‌ లో భాగంగా రెండో టీ20 ఈ నెల 21న జరగనుంది. గాయం కారణంగా కోహ్లీ తదుపరి టీ20కి దూరమైతే జట్టు నాయకత్వ బాధ్యతలను రోహిత్‌ శర్మ నిర్వర్తించనున్నాడు. 

More Telugu News