NDA: కీలక పరిణామం... కేంద్రంపై అవిశ్వాసానికి రాహుల్ గాంధీ ఓకే!

  • ఎన్డీయేపై అవిశ్వాసం పెడదాం
  • రాహుల్ గాంధీని కలిసి విన్నవించిన ఏపీ కాంగ్రెస్ నేతలు
  • ఓకే చెప్పిన కాంగ్రెస్ అధ్యక్షుడు
  • బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం

కేంద్రంలోని ఎన్డీయే సర్కారుపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంది. అవిశ్వాసం పెట్టాలని, అందుకు తమకు మద్దతివ్వాలని వైకాపా అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేస్తూ, తెలుగుదేశం పార్టీని ఇబ్బందులు పెడుతున్న వేళ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీని ప్రత్యేకంగా కలిసి అవిశ్వాసానికి ఒప్పించారు. కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, జేడీ శీలం, టీ సుబ్బరామిరెడ్డి తదితరులు రాహుల్ గాంధీని కలిసి, కేంద్రంపై అవిశ్వాసం పెడదామని, అప్పుడు ఏ పార్టీ కలసి వస్తుందో ప్రజలకు తెలుస్తుందని చెప్పగా, అందుకు రాహుల్ గాంధీ కూడా సమ్మతించారు. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే అవిశ్వాసం పెట్టేందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్టు సమాచారం.

ఇక తనకు అవిశ్వాసం పెట్టడానికి అవసరమైనంత మంది ఎంపీల బలం లేదని, రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీ కూడా కలసి రావాలని వైఎస్ జగన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు టీడీపీని ఒప్పించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కూడా జగన్ కోరారు. మరోవైపు వివిధ టీవీ చానళ్లు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తుండగా, అవిశ్వాసం పెడితే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందని వక్తలు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News