Murali Mohan: పోరాడితే దేవుడైనా దిగొస్తాడు.. రాజీనామా లేఖలు మా జేబులోనే ఉన్నాయి: మురళీ మోహన్

  • ఏపీ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి రావాలని  పిలుపు
  • రాష్ట్రానికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని ఆపబోమన్న ఎంపీ
  • చంద్రబాబు ఆదేశిస్తే తక్షణం రాజీనామాలు చేస్తామన్న మురళీ మోహన్

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి పోరాడితే దేవుడైనా దిగివస్తాడని టీడీపీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ తాము చేస్తున్న పోరాటానికి పార్టీలన్నీ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఆదివారం బొమ్మూరులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలన్నీ ఏకం కాకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు.

ఏపీకి న్యాయం జరిగే వరకు కేంద్రంపై తమ పోరాటం ఆగదని, రాజీనామాలు అన్నవి తమకు చిటెకెలో పని అన్నారు. రాజీనామా లేఖలు జేబులో ఉంచుకునే తిరుగుతున్నామని పేర్కొన్న మురళీ మోహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల కోసమే ఎదురుచూస్తున్నట్టు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పోరాడితే కేంద్రమే దిగివస్తుందని పేర్కొన్నారు.

కాగా, విజయవాడలో ఆదివారం జరిగిన బీజేపీ పథాధికారుల సమావేశంలో టీడీపీ తీరును ఎండగట్టారు. పదవులు తమకు తృణప్రాయమని, ఏపీలో మంత్రి పదవులకు తాము రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ నేతలు తెలిపారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. మిత్ర ధర్మానికి టీడీపీ తూట్లు పొడిచిందని ఆరోపించారు. టీడీపీని ప్రజల ముందు ముద్దాయిని చేయాల్సిందేనని సమావేశంలో నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News