Pawan Kalyan: జేఎఫ్సీ సమావేశాలను విజయవంతం చేసిన మహానుభావులందరికీ నా కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

  • ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్న తెలుగు వారందరికీ  నా ధన్యవాదాలు
  • ఈ సమావేశాల్లో లోతైన చర్చలు పారదర్శకంగా జరిగాయి
  • జేఎఫ్సీ ఉప కమిటీల వివరాలను త్వరలోనే ప్రకటిస్తాం : పవన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరస్పర విరుద్ధ ప్రకటనల వల్ల ప్రజల్లో నెలకొన్న గందరగోళాన్ని తొలగించడానికి ఏర్పాటు చేసిన జేఎఫ్సీ సమావేశాలను విజయవంతం చేసిన మహానుభావులందరికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి ప్రోత్సహిస్తున్న తెలుగు వారందరికీ తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

రెండు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో లోతైన చర్చలు పారదర్శకంగా జరిగాయని అన్నారు. ఏపీ విభజన సమయంలో ఇచ్చిన హామీలు, చేసిన చట్టాలు, ఆ తర్వాత ఏర్పడ్డ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు, తెలుగు రాష్ట్రాలకు వచ్చిన నిధులు వంటి అంశాలపై కమిటీలో ఉన్న నిపుణులు విశ్లేషణ చేయడం ప్రారంభమైందని తెలిపారు. జేఎఫ్సీ కొన్ని ఉప కమిటీలను నియమించిందని, వారి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

జేఎఫ్సీకి అవసరమైన రాజ్యాంగ పూర్వక సలహాలను అందించేందుకు సుముఖత వ్యక్తం చేసి, జేఎఫ్సీ సమావేశానికి హాజరైన జస్టిస్ గోపాల్ గౌడ్ కి తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఈ ప్రకటనలో పేర్కొన్నారు.

More Telugu News