Gonzalez: మిస్టర్ ప్రెసిడెంట్.. ఇది సిగ్గుచేటు... ట్రంప్‌ని కడిగేసిన విద్యార్థిని!

  • ఎన్ఆర్ఏ నుంచి ట్రంప్ విరాళం తీసుకున్నారంటూ ఆరోపణ
  • ఎంత తీసుకున్నారో చెప్పమంటూ నిలదీస్తానని వెల్లడి
  • సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విద్యార్థిని గొంజాలెజ్

ప్లోరిడాలోని పార్క్‌లాండ్ హైస్కూల్‌ విద్యార్థులపై 17 ఏళ్ల నికోలస్ క్రూజ్ ఇటీవల విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ప్రాణాలతో బయటపడిన విద్యార్థిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై తన కోపాన్ని వెళ్లగక్కింది. శక్తిమంతమైన నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ)తో సంబంధాలు ఉన్నందుకు ఎమ్మా గొంజాలెజ్ అనే విద్యార్థిని దేశ రాజకీయ నేతలను తీవ్రంగా విమర్శించింది.

 "ఎన్ఆర్ఏ నుండి విరాళాలు స్వీకరించే ప్రతి రాజకీయ నేతను చూసి సిగ్గుపడుతున్నాను" అని ఆ బాలిక పేర్కొంది. కాల్పుల ఘటనను నిరసిస్తూ ఫ్లోరిడాలో శనివారం చేపట్టిన తుపాకీ వ్యతిరేక ర్యాలీలో ఆమె పాల్గొంది. ట్రంప్ తన ఎన్నికల ప్రచారం కోసం ఎన్ఆర్ఏ నుండి లక్షలాది డాలర్లు విరాళంగా తీసుకున్నారంటూ బాలికతో పాటు ర్యాలీలో పాల్గొన్న వారు తీవ్రంగా ఆరోపించారు. ఎన్ఆర్ఏ నుంచి రాజకీయ నేతలు విరాళాలు తీసుకోవడం 'సిగ్గు చేటు...సిగ్గుచేటు' అంటూ గొంజాలెజ్‌తో పాటు వారంతా శ్రుతి కలిపారు.

నికోలస్ క్రూజ్ ఇతరులకు ఇబ్బంది కల్గించేవాడుగానూ, హింసాత్మక ప్రవర్తన ఉన్నవాడుగానూ చరిత్ర కలిగి ఉన్నప్పటికీ, కాల్పుల కోసం తుపాకీని చట్టబద్ధంగానే అతను కొనుగోలు చేయడంతో అమెరికా గన్ కల్చర్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితుడి మానసిక స్థితి సరిగా లేనందునే కాల్పులు జరిపాడని ట్రంప్ చెప్పడం గమనార్హం.

"ఒకవేళ అధ్యక్షుడు నా వద్దకు వస్తే జరిగిన కాల్పుల ఘటన గురించి ఆయన్ను నిలదీస్తా. ఎన్ఆర్ఏ నుంచి ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండంటూ ఆయన్ను ధైర్యంగా అడుగుతాను. అడగాల్సిన పని లేదు. అది ఎంతనేది నాకు తెలుసు. ఆ మొత్తం ముప్పై మిలియన్ డాలర్లు" అంటూ గొంజాలెజ్ ఎంతో తెగువతో చెప్పింది. ఇలా ట్రంప్‌పై ఆమె నిప్పులు చెరగడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో అంతా గొంజాలెజ్ గురించే చర్చించుకుంటున్నారు.

More Telugu News