harley davidson: ట్రంప్ బెదిరింపులతో మనకొచ్చిన నష్టమేం లేదు... మన బైకులపై పన్నేసినా పోయేదేమీ లేదు!

  • హార్లే బైకులపై పన్నును తప్పుబట్టిన ట్రంప్
  • పన్ను తొలగించకుంటే భారత్ బైకులపై పన్ను వేస్తామని హెచ్చరిక
  • వేసినా మనపై పెద్ద ప్రభావం ఏమీ ఉండదు
  • అమెరికాకు ఎగుమతి అవుతున్నవి చాలా తక్కువే

హార్లే డేవిడ్సన్ బైకులపై భారత్ దిగుమతి సుంకాన్ని విధించడాన్ని తప్పు పడుతూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో స్పందించడం వల్ల మనకొచ్చిన నష్టమేమే లేదు. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ బైకులపై మన దేశం ప్రస్తుతం 50 శాతం దిగుమతి సుంకం విధిస్తోంది. గతంలో ఇది 75 శాతంగా ఉంది. భారత్ నుంచి తమ దేశంలోకి దిగుమతి అవుతున్న బైకులపై అసలు పన్నే వేయడం లేదని, అదే విధంగా స్వేచ్చా వాణిజ్యంలో భాగంగా భారత్ కూడా ఇదే విధానం అనుసరించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. భారత్ ఈ పన్నును తొలగించకపోతే తాము కూడా భారత్ నుంచి వచ్చే బైకులపై పన్నేయాల్సి వస్తుందని హెచ్చరించారు.

కానీ హార్లే డేవిడ్సన్ బైకులపై మన దేశం ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి దిగుమతి సుంకాన్ని ఎత్తేసినప్పటికీ ఆ కంపెనీ పరిస్థితి మారే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ బైకుల విక్రయాలు తగ్గుతూ వస్తున్నాయి. మాతృదేశం అమెరికాలో ఈ బ్రాండ్ వాహనాల విక్రయాలు గతేడాది 8.5 శాతం తగ్గాయి. భారత్ తో కూడిన ఆసియా పసిఫిక్ లోనూ 7.7 శాతం పడిపోయాయి. లాటిన్ అమెరికాలో 2.6 శాతం, మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా 6.7 శాతం తగ్గాయి. ముఖ్యంగా గడిచిన డిసెంబర్ క్వార్టర్లో అమెరికాలో 11.1 శాతం మేర పడిపోయాయి. ఆసియా పసిఫిక్ లో అయితే ఈ క్షీణత 11.8 శాతంగా ఉంది. ఈ బ్రాండ్ బైకుల ఖరీదు మన దేశంలో రూ.లక్షల్లో ఉంటుంది. హార్లే ప్రభ పడిపోతున్న క్రమంలోనే ట్రంప్ హెచ్చరికలు రావడం వ్యూహాత్మకమే.

ఇక భారత్ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల హార్లేకు ఒనగూరేదేమీ లేదని తెలుస్తోంది. మరోవైపు ట్రంప్ అన్నట్టుగా భారత బైకులపై దిగుమతి ట్యాక్స్ వేసినా గానీ పెద్దగా ప్రభావం ఏమీ ఉండదని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న బైకుల్లో అమెరికాకు వెళ్లేవి ఒక శాతం లోపేనని పేర్కొంటున్నారు.

More Telugu News