BJP: టీడీపీ వ్యాఖ్యలపై తదుపరి ఎలా?: చర్చిస్తున్న హరిబాబు, పురందేశ్వరి, కామినేని తదితరులు

  • చంద్రబాబు నిన్నటి వ్యాఖ్యలపై చర్చ
  • టీడీపీ నేతలపై హరిబాబు అసంతృప్తి
  • కేంద్రం నిధులను తమవిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం
  • వాస్తవాలు చెప్పాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను సక్రమంగా అమలు చేయడం లేదని, తామెంతో అసంతృప్తితో ఉన్నామని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆ పార్టీతో ఉన్న పొత్తుపై తదుపరి వ్యూహాన్ని చర్చించేందుకు ఈ ఉదయం విజయవాడలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గం సమావేశమైంది. ఈ సమావేశానికి ఎంపీ హరిబాబు, ఆ పార్టీ మహిళానేత పురందేశ్వరి, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ గోకరాజు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు హాజరయ్యారు.

ఈ సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ, తెలుగుదేశం నేతలు నిజాన్ని దాచి పెట్టి, ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొనని ఎన్నింటినో తాము చేశామని చెప్పిన హరిబాబు, కడపకు స్టీల్ ప్లాంటు, విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ అంశాలు పరిశీలనలో ఉన్నాయని స్పష్టం చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రానికి మేలు చేసేలా కేంద్రం ఎన్నో ఆలోచనలు చేస్తోందని తెలిపిన ఆయన, దుగరాజపట్నం పోర్టు విషయంలో సాంకేతిక పరమైన అవరోధాలు ఉన్నాయని, ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం సూచిస్తే, కేంద్రం ముందడుగు వేస్తుందని స్పష్టం చేశారు.

 బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ తమ పార్టీపై మూకుమ్మడి దాడి జరుగుతోందని, తాము సంయమనం పాటిస్తున్నా టీడీపీ నేతలు నోరు పారేసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలకూ బీజేపీయే కారణమని వెల్లడించిన ఆయన, సీఎం చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడాలని హితవు పరికారు. బీజేపీ పదాధికారుల సమావేశం కొనసాగుతోంది.

More Telugu News