Marriage: ముగిసిన మూఢాలు... పెళ్లి పండగొచ్చింది!

  • మూడు నెలల తరువాత తిరిగి పెళ్లి కళ
  • మార్చి 3, 4 తేదీల్లో శుభ ముహూర్తాలు
  • కల్యాణ మండపాలకు డిమాండ్

దాదాపు మూడు నెలల పాటు కొనసాగిన మూఢాలు నేటితో ముగియడంతో తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చేసింది. గత సంవత్సరం నవంబర్ నుంచి మూఢమి కొనసాగడంతో శుభకార్యాలన్నీ నిలిచిపోగా, కల్యాణ మండపాలు వెలవెలబోయాయి. ఇక ఈ సీజన్ తొలి ముహూర్తం 19వ తేదీన ఉండగా, మార్చిలో 3, 4 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఇప్పటికే 3, 4 తారీఖుల్లో వివాహాది శుభకార్యాలను పెట్టుకున్న ఎంతో మంది పనులను రేపటి నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ శుభకార్యాల సీజన్ జూలై 7వ తేదీ వరకూ ఉంటుందని, పాల్గుణంతో పాటు భాద్రపదం, మార్గశిర మాసాల్లో వివాహాలు జరుపుకోవచ్చని పండితులు చెబుతున్నారు. 3, 4 తారీఖుల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, వరంగల్, గుంటూరు వంటి అన్ని నగరాలు, పట్టణాల్లో అత్యధిక కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ బుకింగ్ ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది.

ఇక బ్యాండ్ మేళం, క్యాటరింగ్, పురోహితులకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కల్యాణ మండపాల అద్దె విస్తీర్ణాన్ని బట్టి రూ. 50 వేల నుంచి లక్షల్లో ఉండగా, వేదిక అలంకరణకు ఖర్చు రూ. లక్ష దాటుతోంది. ఇక విందుకు ఎంచుకునే మెనూను బట్టి సగటు వివాహానికి క్యాటరింగ్ సంస్థలు ప్లేటుకు రూ. 250 నుంచి రూ. 500 వరకూ వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

More Telugu News