PNB: నీరవ్ మోదీని వదిలి దుమ్మెత్తి పోసుకుంటున్న కాంగ్రెస్-బీజేపీ.. కేంద్రమంత్రి నిర్మలపై పరువునష్టం దావా వేస్తానన్న అభిషేక్ సింఘ్వి

  • రాజకీయ రంగు పులుముకున్న నీరవ్ కుంభకోణం
  • పరస్పర ఆరోపణలకు దిగుతున్న కాంగ్రెస్-బీజేపీ
  • నిర్మల వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించాయన్న అభిషేక్ సింఘ్వి

నీరవ్ మోదీ వ్యవహారం చివరికి కాంగ్రెస్-బీజేపీ మధ్య పోరులా మారింది. పూర్తిగా రాజకీయ రంగు సంతరించుకున్న ఈ వ్యవహారం రెండు జాతీయ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలకు కారణమైంది. నీరవ్ మోదీని వదిలి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అభిషేక్ సింఘ్వి-నీరవ్ మోదీల మధ్య బయటపడని సంబంధాలు ఉన్నాయన్న కేంద్రమంత్రి నిర్మాలా సీతారామన్‌పై అభిషేక్ సింఘ్వి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రిపై సివిల్, క్రిమినల్ కేసులు వేయడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే, మీడియాపై కూడా ఇలాంటి చర్యలే తీసుకుంటానని హెచ్చరికలు జారీ చేశారు. నీరవ్ మోదీతో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నీరవ్ మోదీ కుంభకోణం మొత్తం 2011లోనే జరిగిందని, ఆ పాపం యూపీఏదేనని అన్నారు. ఫైర్‌స్టోన్ ఇంటర్నేషనల్ ప్రైవేటు లిమిటెడ్ అనేది నీరవ్ కంపెనీల్లో ఒకటని, అద్వైత్ హోల్డింగ్స్ నుంచి దానిని కొనుగోలు చేశారని మంత్రి పేర్కొన్నారు. 2002 నుంచి అభిషేక్ సతీమణి అనితా సింఘ్వి ఆ కంపెనీలో వాటాదారుగా ఉన్నారన్నారు.

అయితే, మంత్రి ఆరోపణలను అభిషేక్ ఖండించారు. బీజేపీ నీచ రాజకీయాలకు ఇది ఉదాహరణ అని దుమ్మెత్తి పోశారు. అద్వైత్ హోల్డింగ్స్‌, ఫైర్‌స్టోన్‌తో తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఈ విషయంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసిన మంత్రిపై పరువు నష్టం దావా వేసే విషయాన్ని ఆలోచిస్తానని సింఘ్వి పేర్కొన్నారు.  

More Telugu News