Nirav Modi: రూ. 11 వేల కోట్ల నుంచి రూ. 17 వేల కోట్లకు పెరిగిన నీరవ్ మోదీ మోసం!

  • వెల్లడించిన ఐటీ శాఖ నివేదిక
  • ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
  • వారిని విచారిస్తున్నామన్న ఐటీ అధికారులు

పంజాబ్ నేషనల్ బ్యాంకులో జరిగిన కుంభకోణంపై ఆదాయపు పన్ను శాఖ సిద్ధం చేసిన నివేదిక మరింత కలకలం రేపుతోంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఇండియాలో బ్యాంకులను మోసం చేసింది సుమారు రూ. 11,300 కోట్లని భావిస్తుండగా, ఆయన చేసిన మోసం విలువ రూ. 17,600 కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఐటీ శాఖ వర్గాలు వెల్లడించాయి.

గత సంవత్సరం మార్చి వరకూ ఈ మొత్తాన్ని వివిధ బ్యాంకుల నుంచి రుణాల రూపంలో నీరవ్ మోదీ, ఆయన మేనమామ మేహుల్ చౌక్సీ పొందారని ఈ నివేదికలో అధికారులు పొందుపరిచారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే పీఎన్బీ మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోకుల్ నాథ్ శెట్టి, మరో ముగ్గురు బ్యాంకు డైరెక్టర్లతో పాటు నీరవ్ మోదీ కంపెనీ డైరెక్టర్ హేమంత్ భట్ ను సీబీఐ అరెస్టు చేయగా తాము వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నట్టు ఐటీ శాఖ రిపోర్టు వెల్లడించింది.

పీఎన్బీకి నీరవ్ మోదీ సమర్పించిన మూడు చిరునామాల్లో వజ్రాభరణ కంపెనీలే లేవని కూడా పేర్కొంది. రుణాలు తీసుకుంటున్న సమయంలో కంపెనీలు ఉన్న అసలైన చిరునామాలను సమర్పించలేదని తెలిపింది. పీఎన్బీ యాజమాన్యానికి ఇప్పటికే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నోటీసులు ఇచ్చిందని, వారిని కూడా విచారించాల్సి వుందని వెల్లడించింది. కాగా, సీబీఐ అభ్యర్థన మేరకు నీరవ్ మోదీపై ఇంటర్ పోల్ నుంచి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 

More Telugu News