health card: రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు.. హెల్త్‌ కార్డులు: కడియం శ్రీహరి

  • ‘ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటలాజిస్ట్స్’ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
  • ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి
  • కేసీఆర్ హెల్త్ కిట్స్ వల్ల ప్ర‌భుత్వ‌ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుదల 
  • భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్రం వచ్చాక విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య పరీక్షలు చేసి, ఆరోగ్య కార్డులు అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు. హైదరాబాద్ లోని ఒక హోటల్ లో ఏషియన్ కాంగ్రెస్ ఆఫ్ ఓరల్ ఇంప్లాంటలాజిస్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిర్వాహకుల ఆధ్వర్యంలో క‌డియం శ్రీహ‌రి కేక్ కట్ చేశారు. ఈ రోజు ఇలాంటి కార్యక్రమంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేయడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఆరోగ్య కార్డులను అందించడానికి కేసీఆర్ చేస్తోన్న కృషిలో భాగంగా తమ విద్యా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించి, విద్యాశాఖ ద్వారా వారికి ఆరోగ్య కార్డులు అందించాలని ప్రయత్నిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు.

ప్రజారోగ్యానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చాక అమలు జరుగుతున్న కేసీఆర్ హెల్త్ కిట్స్ వల్ల ప్ర‌భుత్వ‌ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. గర్భిణీ స్త్రీలకు ఆరు నెలల పాటు రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం 12 వేల రూపాయలు ఇవ్వడం, ప్రసవం అనంతరం తల్లీబిడ్డలకు కావల్సిన 15 రకాల ఉత్పత్తులతో కిట్ అందించ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌న్నారు. ఇండియన్ డెంటల్ అసోసియేషన్, తెలంగాణ చాఫ్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ వల్ల దంత సంరక్షణపై అవగాహన పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు.

అయితే ప్రజల్లో దంత సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని కోరారు. విద్యాశాఖ పరంగా విద్యార్థులకు ఆరోగ్య కార్డులు ఇచ్చే సందర్భంలో దంత పరీక్షలకు సంబంధించి స్వచ్ఛందంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ వారి సేవలు అందించాలన్నారు. ఈ సమావేశంలో కాన్ఫరెన్స్ చైర్మన్ డాక్టర్ కరుణాకర్, ఇతర డాక్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.    

More Telugu News