Myanmar: మళ్లీ మాతృభూమికి... రోహింగ్యాల కోసం మయన్మార్ మూడు దశల ప్రణాళిక!

  • రోహింగ్యాలను వెనక్కి తీసుకెళ్లేందుకు సిద్ధమన్న మయన్మార్
  • శరణార్థులకు పునరావాసం, పౌరులుగా గుర్తింపు
  • మళ్లీ తమదేశంలోకి ప్రవేశించకుండా చూడాలని బంగ్లా వినతి

దాదాపు ఏడు లక్షల మంది మైనార్టీ రోహింగ్యా ముస్లింలను తిరిగి వెనక్కి తెచ్చి, వారికి పునరావాసం కల్పించడానికి మయన్మార్ ప్రభుత్వం మూడు దశల ప్రణాళికను రూపొందించింది. మయన్మార్ ఆర్మీ చర్యలతో రోహింగ్యాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పొరుగునే ఉన్న బంగ్లాదేశ్‌ కు పారిపోయి, తలదాచుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో, మూడు రోజుల పర్యటనలో భాగంగా ఢాకాలో పర్యటిస్తున్న మయన్మార్ హోం శాఖ మంత్రి క్యావ్ స్వీ శుక్రవారం బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జామన్ ఖాన్ కమల్‌తో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా వారిద్దరూ రోహింగ్యా శరణార్థులను తిరిగి మయన్మార్ తీసుకెళ్లడానికి అవసరమైన ప్రణాళిక గురించి చర్చించారు.

భేటీ అనంతరం కమల్ మాట్లాడుతూ....రోహింగ్యా ముస్లింలను తిరిగి తమ దేశానికి తీసుకెళ్లడానికి మూడు దశల ప్రణాళికను రూపొందించినట్టు మయన్మార్ తెలిపిందని ఆయన చెప్పారు. రోహింగ్యాలను వెనక్కి తీసుకెళ్లడం, వారికి పునరావాసం కల్పించడం, తర్వాత వారికి పౌరసత్వ గుర్తింపును కల్పించడం లాంటి మూడు దశల ప్రణాళికను మయన్మార్ రూపొందించిందని ఆయన చెప్పారు. కోఫి అన్నన్ కమీషన్ నివేదికను అనుసరించి, మయన్మార్ తమ పౌరులను తిరిగి వెనక్కి తీసుకెళ్లుతుందనే నమ్మకం తమకు కలుగుతోందని కమల్ చెప్పారు.

కానీ, వివాదానికి కేంద్ర బిందువైన మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రంలో శరణార్థులకు తగిన రక్షణ, ఆహార సదుపాయాలు కల్పించని పక్షంలో వారు మళ్లీ తమ దేశానికి వలస వచ్చే ప్రమాదముందని ఆయన అన్నారు. మరోవైపు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్‌తో స్వీ శుక్రవారం భేటీ అయ్యారు. గతేడాది ఆఖర్లో ఇరు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం, రోహింగ్యాలను వెనక్కి తీసుకుపోవడానికి మయన్మార్ సిద్ధంగా ఉందని స్వీ చెప్పారు.

More Telugu News