Chandrababu: ఈ రోజు ఇక్క‌డి నుంచి ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను: చ‌ంద్ర‌బాబు

  • బడ్జెట్‌లో ఏపీకి సరైన కేటాయింపులు లేవు
  • కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సిందే
  • మేము రాజీపడము
  • రాజకీయాల్లో ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది

తాను ఈ రోజు ఇక్క‌డి నుంచి ఐదు కోట్ల ఆంధ్రుల తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని, ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు అన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా నరసరావు పేటలో జేఎన్టీయూ కాలేజీ శంకుస్థాప‌న కార్యక్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఏపీ చాలా న‌ష్ట‌పోయింద‌ని అన్నారు. హేతుబద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని, ప్రత్యేక హోదాతో పాటు పలు ప్రత్యేక ప్రయోజనాలను ఇస్తామని పార్లమెంటులో చెప్పారని అన్నారు.

ఇప్పటికి మూడున్నరేళ్లు అయిపోయిందని, రాజకీయాల్లో ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. అందరూ అర్థం చేసుకోవాలని, మనం చేయని తప్పుకి మనం శిక్ష అనుభవిస్తున్నామ‌ని వ్యాఖ్యానించారు. హేతుబద్ధతతో విభజన జరిగి ఉంటే మనకు ఈ సమస్య వచ్చేది కాదని చెప్పారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లొచ్చానని తెలిపారు. చివరి బడ్జెట్‌లోనూ అన్యాయం జరిగినప్పుడు కూడా ఇక మ‌న‌కు మంచిది కాద‌ని గుర్తించి గట్టిగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిలదీస్తున్నామ‌ని అన్నారు.

తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని పెట్టారని, మ‌న‌కు న‌ష్టం క‌లుగుతుంటే చూస్తూ ఊరుకోమ‌ని, రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో రాజీప‌డ‌బోమ‌ని తెలిపారు. త‌న‌కు ఎవ్వరి మీద కోపం లేదని, ఆ రోజు కాంగ్రెస్ అన్యాయం చేసిందని, ఈ రోజు బీజేపీ కూడా పూర్తిగా సహకారం అందించడం లేదని అన్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం హామీల‌ను నెర‌వేర్చాల్సిందేన‌ని చంద్రబాబు అన్నారు. కొంద‌రు రాజ‌కీయాలు చేస్తున్నారని, మనం అంతా కలసి ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. ఇన్నేళ్లుగా ఇత‌రులు ఎవ్వ‌రూ కేంద్ర ప్ర‌భుత్వాన్ని అడ‌గ‌లేదని, తానే ఢిల్లీకి వెళ్లి అడిగి వ‌స్తున్నానని తెలిపారు. రాష్ట్రానికి మంచి జ‌ర‌గాల‌నే గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నామ‌ని అన్నారు. బడ్జెట్‌లో ఏపీకి సరైన కేటాయింపులు లేవని స్పష్టం చేశారు.

విద్యా విధానంలో చాలా సంస్కరణలు తీసుకొస్తాం

కాగా, 20 ఏళ్ల కంటే ముందే తాను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాన‌ని చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతిక వినియోగంతో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామ‌ని తెలిపారు. భవిష్యత్తుల్లో ఆంధ్రప్రదేశ్‌ విద్యా విధానంలో చాలా సంస్కరణలు తీసుకొస్తామ‌ని చెప్పారు. ఆనంద వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాలని, మొక్కుబడిగా చదువుకోవడం మంచి పద్ధతి కాదని, విద్యార్థులు సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కార మార్గం చూపించే విధంగా త‌యారు కావాల‌ని సూచించారు.      

More Telugu News