rgv: సీసీఎస్ విచారణకు హాజరైన వర్మ.. అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది ఆయనపైనే ఆధారపడి ఉంటుందన్న సైబర్ క్రైమ్ డీసీపీ

  • జీఎస్టీ చిత్రానికి సంబంధించి వర్మపై కేసు
  • విచారణకు అడ్వొకేట్ తో కలసి హాజరైన వర్మ
  • పూర్తి స్థాయిలో విచారిస్తామన్న సైబర్ క్రైమ్ డీసీపీ

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'జీఎస్టీ' వెబ్ చిత్రం పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. చిత్రంలో ఆశ్లీలతపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఇదే సమయంలో మహిళలను కించపరిచేలా వర్మ మాట్లాడారంటూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు మహిళా సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, కాసేపటి క్రితం పోలీసు విచారణ కోసం వర్మ సీసీఎస్ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయనతో పాటు ఆయన అడ్వొకేట్ కూడా వచ్చారు. కార్యాలయంలోకి వీరిద్దరిని తప్ప, మరెవరినీ అనుమతించలేదు.

దీనికి ముందు... ఓ టీవీ ఛానల్ తో సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ, వర్మను పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పారు. అందరిలాగానే సామాన్య నిందితుడిగానే వర్మను పరిగణిస్తామని... చట్టం దృష్టిలో అందరూ సమానమే అని తెలిపారు. జీఎస్టీ సినిమాకు సంబంధించి ఒక ఎఫ్ఐఆర్, మహిళలను కించపరిచేలా మాట్లాడారనే దానికి సంబంధించి మరొక ఎఫ్ఐఆర్ ఆయనపై నమోదయ్యాయని... వీటన్నింటిపై విచారణ జరుగుతుందని అన్నారు. దాదాపు 4 గంటల పాటు విచారణ జరిగే అవకాశం ఉందని చెప్పారు. జీఎస్టీ సినిమాను ఎందుకు తీశారో ఆయన సమాధానం చెప్పాలని అన్నారు. ఆర్జీవీ ఇచ్చే సమాధానాలను బట్టే ఆయనను అరెస్ట్ చేయాలా? వద్దా? అనే అంశాన్ని నిర్ణయిస్తామని చెప్పారు.

More Telugu News