bjp: ఏపీకి ఇవ్వాల్సినదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసింది!: సోము వీర్రాజు

  • ఇంకేం బాకీ ఉన్నామో చంద్రబాబే చెప్పాలి
  • అమరావతికి ఇచ్చిన రూ.1600 కోట్లు ఏం చేశారు?
  • నిధులు సాధించడంలో తాను నెంబర్ వన్ అనే చంద్రబాబు యూ టర్న్ ఎందుకు తీసుకున్నారు?
  • రాజీనామాలు చేస్తామంటూ టీడీపీ, వైసీపీ డ్రామాలాడుతున్నాయి 

టీడీపీపై బీజేపీ ఏపీ ఫైర్ బ్రాండ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మళ్లీ  ఫైర్ అయ్యారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి ఇవ్వాల్సినదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేసిందని, ఇంకేం బాకీ ఉన్నామో చంద్రబాబే చెప్పాలంటూ వ్యాఖ్యానించారు. విభజన బిల్లు అమలు గడువు 2022 వరకు ఉంటే, నాలుగేళ్లలోనే ఉద్యమాన్ని తీసుకొస్తారా? రాజధాని అమరావతి లో కేవలం నాలుగు నిర్మాణాలకు మాత్రమే కేంద్రం ప్రభుత్వం సాయం చేసేలా విభజన చట్టంలో ఉందని, అసలు అమరావతికి ఇచ్చిన రూ.1600 కోట్లు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.

నిధులు సాధించడంలో తానే నెంబర్ వన్ అని అంటున్న చంద్రబాబు, ఇప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని విమర్శించిన ఆయన, రాష్ట్రంలో మేం ఎదుగుతామని టీడీపీకి భయం పట్టుకుందని అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందంటూ రాజీనామాలు చేస్తామంటున్న టీడీపీ, వైసీపీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. టీడీపీతో పొత్తు వద్దని తాము అనడం లేదని, చెప్పినవన్నీ చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు.

టీడీపీ మిత్రపక్షంగా ఉంటూ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వెనుకబడ్డ ఏడు జిల్లాల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం 30 శాతం రాయితీ ఇచ్చిందని అన్నారు. మరి, వెనుకబడిన జిల్లాలకు టీడీపీ ఏం చేసిందని ప్రశ్నించారు. మేమిచ్చిన రాయితీతో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారని, దీనిపై సీఎం చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More Telugu News