Orrin Hatch: అమెరికా ఇమిగ్రేషన్ బిల్లు: ప్రతిభావంతులకు గ్రీన్‌కార్డులు మరింత సులభతరం!

  • ఇమిగ్రేషన్ బిల్లుకు కీలక సవరణలు సూచించిన రిపబ్లికన్ సెనేటర్
  • వార్షికాదాయ పరిమితిని 60 వేల నుండి లక్ష డాలర్లకు పెంపు
  • తాజా సవరణలు దేశ ఆర్థికవ్యవస్థకు మేలు చేస్తాయని ఆకాంక్ష

అమెరికా సెనేట్‌లో ప్రవేశపెట్టిన ఇమిగ్రేషన్ బిల్లుకు అధికార పార్టీ రిపబ్లికన్ సెనేటర్ ఒర్రిన్ హ్యాచ్ పలు సవరణలు సూచించారు. ఆయన ప్రతిపాదించిన సవరణలు ప్రధానంగా భారత్, చైనా దేశాల్లోని ప్రతిభావంతులు గ్రీన్ కార్డులను మరింత సులభతరంగా పొందేందుకు ఎంతగానో దోహదం చేస్తాయి. దేశాల జనాభా, లాటరీ పద్ధతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులను జారీ చేయాలనే లక్ష్యంతో అమెరికా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు సెనేటర్ హ్యాచ్ తనకు తోచిన కొన్ని ముఖ్యమైన సవరణలను సూచించారు.

గ్రీన్ కార్డు జారీకి హెచ్1బీ వీసాల జారీ సంఖ్య పరిమితి విధానం నుంచి అమెరికా మాస్టర్ డిగ్రీ అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగిన వారిని మినహాయించడం ఈ సవరణల్లో ఒకటి. మరోవైపు వీసాల జారీకి ఇప్పటివరకు ఉన్న 60 వేల డాలర్ల వార్షికాదాయ పరిమితిని లక్ష డాలర్లకు పెంచాలని కూడా ఆయన సూచించారు. అంతేకాక హెచ్1బీ వీసాలపై ఆధారపడి ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు మేలు చేసేలా ఈ చట్టానికి కొన్ని మార్పులను ఆయన ప్రతిపాదించారు.

తాను సూచించిన ఈ సవరణలకు విస్తృతమైన మద్దతు లభిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సవరణలు అమెరికా ఆర్థిక వ్యవస్థలో వాస్తవికమైన మార్పును తీసుకురావడానికి దోహదం చేస్తాయని ఆయన అన్నారు. ప్రతిభావంతులకు సులభతరమైన రీతిలో గ్రీన్ కార్డుల జారీకి అవసరమైన సూచనలు చేసేందుకు లభించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని హ్యాచ్ చెప్పారు.

More Telugu News