Narendra Modi: విద్యార్థులకు ఆత్మవిశ్వాసం లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరు: విద్యార్థులతో మోదీ

  • ప‌రీక్ష‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో 'పరీక్షా పే చర్చా' పేరుతో మోదీ సూచనలు
  • దేవతలను పూజించాలని విద్యార్థులకు పెద్దలు సూచిస్తారు
  • విద్యార్థులకు ఆత్మవిశ్వాసం ఉండాలి
  • మనసు, బుద్ధి, శరీరం, ఆత్మను ఏకతాటిపైకి తెస్తే ఏకాగ్రత సాధ్యం

విద్యార్థుల‌కు ప‌రీక్ష‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో 'పరీక్షా పే చర్చా' పేరుతో ఈ రోజు ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ ఢిల్లీలోని తల్కోతోరా స్టేడియంలో విద్యార్థులతో చర్చా గోష్ఠి నిర్వ‌హించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పారు. త‌నను ఓ స్నేహితుడిగా భావించి మాట్లాడ‌మ‌ని మోదీ చెప్పారు. పరీక్ష రాయడానికి కూర్చున్నప్పుడు విద్యార్థుల ధ్యాస అంతా పరీక్ష మీదే ఉండాలని చెప్పారు.

ఆత్మవిశ్వాసం ఉంటే ఎటువంటి కష్టం వచ్చినా సులభంగా అధిగమించగలరని మోదీ అన్నారు. ఏకాగ్రతతో చ‌దువుకోవ‌డానికి మంచి మార్గం యోగా అని, దీన్ని కొంతమంది వ్యాయామం అంటారని, కానీ అది అన్నింటికంటే ఎక్కువ అని తాను భావిస్తానని తెలిపారు. యోగా ద్వారా ఏకాగ్రతను పొందొచ్చ‌ని తెలిపారు. మనసు, బుద్ధి, శరీరం, ఆత్మను ఏకతాటిపైకి తెస్తే ఏకాగ్రత సాధ్యమ‌ని చెప్పారు. తల్లిదండ్రులు త‌మ కోసం అన్నింటినీ త్యాగం చేస్తారనే విషయాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు.

సమయపాలన ఉండాలని చాలా మంది ప్రయత్నిస్తారని, దాని కోసం సామాజిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారని మోదీ అన్నారు. అయితే, దాని వల్ల ఫలితాలను పొందలేరని, అందుకే డీఫోకస్‌ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్య‌మ‌ని అన్నారు. దేవతలను పూజించాలని విద్యార్థులకు పెద్దలు సూచిస్తారని, అయితే, విద్యార్థులకు ఆత్మవిశ్వాసం లేకపోతే దేవతలు కూడా ఏమీ చేయలేరని అన్నారు. 

More Telugu News