bjp: ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తించాలి : బీజేపీ ఎంపీ హరిబాబు

  • ఏపీ, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయడం వల్లే అభివృద్ధి 
  • నాలుగేళ్లలోనే సంస్థలను ఏర్పాటు చేశాం
  • ఏపీకి ఇంకా సాయం కావాలంటే కేంద్రాన్ని అడుగుదాం
  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన హరిబాబు

ఏపీకి కేంద్రం చేసిన సాయాన్ని గుర్తించాలని, ఈ నాలుగేళ్ల కాలంలో ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయడం వల్లనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమైందని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయం నుంచి ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, అందుకే, ఏపీకి ప్రత్యేక ప్యాకేజ్ ని ప్రకటించడం జరిగిందని హరిబాబు అన్నారు.

 ఏపీ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలోనే దూరదర్శన్ కేంద్రం మంజూరు చేశామని, నాటి ప్రధాని హామీ మేరకే ప్రత్యేక ఆర్థిక వెసులుబాటు కల్పిస్తామని, విభజన హామీ ప్రకారం చాలా హామీలు నెరవేర్చామని అన్నారు. పదేళ్లలో ఏర్పాటు చేయాల్సిన సంస్థలను నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని చెప్పారు. ఈరోజున ఏపీ ఆర్థిక వ్యవస్థ శరవేగంగా ముందుకువెళ్లడానికి, వృద్ధి రేటు రెండంకెల స్థాయిని చేరుకోవడానికి కారణం కేంద్ర సహకారమేనని అన్నారు. ఏపీకి ఇంకా సాయం కావాలంటే కేంద్రాన్ని అడుగుదామని, మంచి ప్రాజెక్టులు ఏపీకి వచ్చేందుకు కృషి చేద్దామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సమన్వయంతో ముందుకు వెళితేనే  ఏపీ ప్రయోజనాలు పరిరక్షించబడతాయని సూచించారు.

More Telugu News