Rajanikant: 'కాలా'కు బయ్యర్ల కరవు... దిల్ రాజు, చదలవాడ సోదరులను ఆశ్రయించిన ధనుష్!

  • ఏప్రిల్ 27న విడుదల కానున్న 'కాలా'
  • అదే సమయంలో మహేష్, అల్లు అర్జున్ చిత్రాలు
  • 'కాలా' కొనుగోలుకు ముందుకు రాని బయ్యర్లు
  • సాయం చేయాలని దిల్ రాజును కోరిన ధనుష్

రజనీకాంత్... అసలా పేరు చెబితేనే నిర్మాతలు క్యూ కడతారు. ఆయన సినిమా చేస్తానంటే ఎంతకాలమైనా వేచి చూస్తారు. ఇక సినిమా పూర్తయిన తరువాత దక్షిణాది రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఫ్యాన్సీ రేటు పెట్టి హక్కులను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, ఆయన కొత్త చిత్రం 'కాలా' విషయంలో మాత్రం అలా జరగడం లేదు. 'కబాలీ' ఫ్లాప్ తో 'కాలా'ను కొనుగోలు చేసేందుకు బయ్యర్స్ ముందుకు రావడం లేదట.

దీనికితోడు 'కాలా' విడుదల కానున్న ఏప్రిల్ 27కు అటూఇటుగా తెలుగులో రెండు పెద్ద చిత్రాలు విడుదల కానుండటం కూడా బయ్యర్లను భయపెడుతోందట. మహేష్ బాబు, అల్లు అర్జున్ నటించిన చిత్రాలు కూడా అదే సమయంలో విడుదలవుతుండడంతో 'కాలా'కు చాలా తక్కువ మొత్తాన్నే నిర్మాతలు ఆఫర్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఆందోళనకు గురవుతున్న చిత్ర నిర్మాత, రజనీ అల్లుడు ధనుష్ స్వయంగా రంగంలోకి దిగాడట.

ఈ క్రమంలో ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు, ప్రధాన డిస్ట్రిబ్యూటర్లలో ఒకరైన చదలవాడ సోదరులను కలసి చర్చలు సాగించారని తెలుస్తోంది. కాగా, శంకర్ దర్శకత్వంలో రజనీ నటించిన '2.0'కు తెలుగు డబ్బింగ్ హక్కులను ఆసియన్ ఫిల్మ్స్ రూ. 90 కోట్ల భారీ మొత్తాన్ని ఇచ్చి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో 30 శాతం కూడా 'కాలా'కు లభించని పరిస్థితి ఇప్పుడు నెలకొన్నట్టు సమాచారం.

More Telugu News