Florida high school: కాల్పులకు తెగబడిన ఉన్మాది ఆపై తాపీగా మెక్ డొనాల్డ్స్ కు వెళ్లి మెక్కాడు!

  • వాల్ మార్ట్, మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ల వద్ద ఆగిన నిందితుడు
  • కాల్పులు జరపగానే స్టూడెంట్లతో కలిసి పరుగులు
  • ప్రొఫెషనల్ షూటర్ అవుతానంటూ గతంలోనే యూట్యూబ్‌లో ఓ కామెంట్?

ఫ్లోరిడాలోని ఓ హైస్కూల్‌పై ఉన్మాదంతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 17 మందిని పొట్టనపెట్టుకున్న నిందితుడు నికోలస్ క్రూజ్ ఆ తర్వాత సమీపంలోని రెండు ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లను సందర్శించాడు. ఈ మారణకాండ జరిగిన రెండు గంటల్లోపే అతన్ని పట్టుకున్న అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. తొలుత ఓ వాల్‌మార్ట్ సబ్ వే రెస్టారెంటు వద్ద, ఆ తర్వాత మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లోకి వెళ్లాడని వారు చెప్పారు.

అతను కాల్పులు జరిపిన తర్వాత భయకంపితులై పరుగులు తీస్తోన్న స్టూడెంట్ల సమూహంలో తను కూడా కలసిపోయాడని వారు తెలిపారు. "అనుమానితుడు కాల్పులు జరిపిన తర్వాత భయంతో పరుగులు తీస్తోన్న వారితో కలిసి పరిగెత్తాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీస్తున్న వారితో కలిసిపోయేందుకు అతను ప్రయత్నించాడు" అని బ్రోవార్డ్ కంట్రీ షరీఫ్ స్కాట్ ఇజ్రాయెల్ మీడియాకి తెలిపారు.

నిందితుడు క్రూజ్ బుధవారం నాడు అనుమతి పొందిన ఏఆర్-15 స్టైల్ తుపాకీతో మియామీ వెలుపల ఉన్న పార్క్ ల్యాండ్‌లోని మార్జొరీ స్టోన్‌మ్యాన్ డౌగ్లాస్ హైస్కూల్‌‌ విద్యార్థులపై కాల్పులకు తెగబడ్డాడు. అతను అదే స్కూల్‌కి చెందిన పూర్వ విద్యార్థి కావడం గమనార్హం. అయితే అతన్ని స్కూల్ యాజమాన్యం బహిష్కరించింది. నిందితుడు క్రూజ్ 'నేనొక ప్రొఫెషనల్ స్కూల్ షూటర్'నవుతానంటూ యూట్యూబ్ వీడియోలో ఇదివరకే హెచ్చరిక సంకేతాలను పంపాడట.

గత సెప్టెంబరులో ఆ కామెంట్‌ వీడియోను ఓ యూట్యూబ్ యూజర్ అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ)కి పంపాడు. కానీ, ఆ కామెంట్‌ క్రూజ్‌కి సంబంధించినదిగా దర్యాప్తు సంస్థ భావించలేదు. కాగా, ఈ ఏడాదిలో ఓ అమెరికా స్కూల్‌లో ఇలాంటి కాల్పులు జరగడం ఇది 18వ సారి కావడం ఆందోళన కలిగించే విషయం. తాజా కాల్పుల నేపథ్యంలో అమెరికాలో తుపాకీ సంస్కృతిపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

More Telugu News