Kaveri River: కావేరీ తీర్పు... తమిళనాడుకు 177 టీఎంసీలు కేటాయించిన సుప్రీం

  • ఏ రాష్ట్రానికీ సంపూర్ణ హక్కులుండవు
  • తమిళనాడుకు ఏటా 177.25 డీఎంసీల కేటాయింపు
  • కర్ణాటకకు అదనంగా 14.75 టీఎంసీలు.. మిగతా రాష్ట్రాల వాటాలో మార్పు లేదు
  • 15 ఏళ్ల పాటు అమలులో తీర్పు
  • తుది తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

కావేరీ నదీ జలాలపై ఏ ఒక్క రాష్ట్రానికీ సంపూర్ణ హక్కు లేదని సుప్రీంకోర్టు తేల్చింది. కొద్దిసేపటి క్రితం కావేరీ వివాదంపై తుది తీర్పును ఇచ్చిన ధర్మాసనం, తమిళనాడుకు న్యాయబద్ధంగా ఏటా 177.25 టీఎంసీల కావేరీ నీరు దక్కాలని పేర్కొంది. ఇదే సమయంలో కర్ణాటకలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని ఆదేశించింది. తమిళనాడుకు వెళ్లాల్సిన నీటిని నదిలోని నీటి పరిమాణాన్ని అనుసరించి ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

బెంగళూరు నగరవాసుల తాగునీటి అవసరాలకు 4.75 టీఎంసీలు కేటాయిస్తున్నట్టు తీర్పిచ్చిన సుప్రీంకోర్టు, కేరళ, పుదుచ్చేరి వాటాలలో ఎటువంటి మార్పు లేదని పేర్కొంది. నదీ జలాలు జాతీయ సంపదని, తామిస్తున్న తీర్పు 15 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ఆ తరువాత మారిన పరిస్థితులను అనుసరించి, తీర్పును సమీక్షించాలని రాష్ట్రాలు కోరవచ్చని తెలిపింది.

More Telugu News