Supreme Court: అత్యాచార బాధితులకు పరిహారం ఆరు వేలేనా?: మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం మండిపాటు

  • ఒక్కో రేప్‌ను రూ.6500గా ఎలా లెక్కిస్తారు?
  • మీరేమైనా 'ఛారిటీ' నడుపుతున్నారా?
  • మధ్యప్రదేశ్‌లో రేప్ బాధితులకు పరిహారంపై సుప్రీం ఫైర్

అత్యాచార బాధితులకు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పరిహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "అత్యాచార బాధితులకు పరిహారం కింద ఆరు వేలేనా ఇవ్వడం? ...మీరేమైనా 'చారిటీ' నడిపిస్తున్నారా?" అంటూ గురువారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు తీవ్రంగా మండిపడింది. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం నుండి అత్యధికంగా నిధులు అందుకుంటున్న రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ తమ రాష్ట్రంలోని ఒక్కో అత్యాచార బాధితురాలికి ఆరు వేల రూపాయల నుండి ఆరువేల ఐదు వందల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తుండటాన్ని మదన్ బి లోకూర్, దీపక్ గుప్తాలతో కూడిన సుప్రీం ధర్మాసనం తీవ్రంగా తప్పుబట్టింది.

పరిహారానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను పరిశీలించిన సందర్భంగా ధర్మాసనం ఈ మేరకు ఘాటుగా స్పందించింది. మధ్యప్రదేశ్‌లో మొత్తం 1951 మంది అత్యాచార బాధితులున్నారు. వారిలో ఒక్కొక్కరికి రూ.6500 చొప్పున పరిహారాన్ని ఎలా నిర్ణయిస్తారు? అంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. 'అసలు ఒక్కో అత్యాచారాన్ని రూ.6500 అని ఎలా లెక్కగడతారు? ఇది పూర్తిగా స్పృహలో వుండి చేస్తున్న పనికాదు' అంటూ ధర్మాసనం చివాట్లు పెట్టింది. నిర్భయ నిధి కింద అందుకున్న నిధుల తాలూకూ వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్‌ దాఖలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు గతనెల ఆదేశించిన సంగతి తెలిసిందే.

More Telugu News