Rouhani: ఢిల్లీ, ముంబైలను వదిలి నేరుగా హైదరాబాద్ రావడానికి కారణమిదే: ఇరాన్ అధ్యక్షుడు రౌహనీ

  • కుతుబ్ షాహీల కాలం నుంచి హైదరాబాద్ తో సంబంధాలు
  • ఇక్కడే స్థిరపడిన వేలాది ఇరానీయులు
  • చారిత్రక ప్రాధాన్యమున్న నగరం కావడంతోనేనన్న రౌహనీ

డాక్టర్ హసన్ రౌహనీ... ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు. మరో దేశానికి చెందిన అధ్యక్షుడు ఇండియాను సందర్శిస్తున్నారంటే, వారు దేశ రాజధాని న్యూఢిల్లీలో తొలుత కాలుమోపుతారు. చాలా తక్కువ మంది తొలుత ముంబైకి వచ్చి, ఆపై న్యూఢిల్లీకి వెళ్లిన సందర్భాలున్నాయి. ఇక రౌహానీ, తన పర్యటన ప్రారంభానికి హైదరాబాద్ ను ఎంచుకున్నారు. దీనికి కారణమేంటన్న విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కుతుబ్ షాహీల కాలం నుంచి హైదరాబాద్ కు ఇరాన్ తో సంబంధాలున్నాయని, ఇక్కడ కొన్ని వేలమంది ఇరానీయులు ఉన్నారని గుర్తు చేసిన ఆయన, తన దృష్టిలో హైదరాబాద్ చారిత్రక ప్రాధాన్యమున్న నగరమని, అందువల్లే తొలుత ఇక్కడికి వచ్చానని చెప్పారు. ఎన్నో కులాలు, మతాల ప్రజలు ప్రేమతో, శాంతితో జీవిస్తున్న ఇండియా అంటే తనకెంతో ఇష్టమని తెలిపారు. ఇస్లాం మతం ఎన్నడూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదని, తమ దేశం కూడా ఉగ్ర బాధిత దేశమేనని అన్నారు.

కాగా, హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో బసచేసిన రౌహానీ, నేడు పలు ప్రదేశాల్లో పర్యటించనున్నారు. కుతుబ్ షాహీ సమాధులను సందర్శించుకునే ఆయన, అనంతరం చార్మినార్ వద్దకు వెళతారు. ఆపై మక్కామసీదులో జరిగే మధ్యాహ్నం ప్రార్థనల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్ లో స్థిరపడిన ఇరాన్ ప్రజల సంతతితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం మక్కా మసీదును సందర్శించనున్న తొలి విదేశీ అధ్యక్షుడు రౌహనీయే కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ తదితరులు పాల్గొంటారు. ఆపై ఆయన న్యూఢిల్లీ పయనమవుతారు. ఇరాన్ అధ్యక్షుడి పర్యటనతో మక్కా మసీదు, కుతుబ్ షాహీ సమాధుల వద్ద 2 వేల మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

More Telugu News