SBI: క్రిప్టో కరెన్సీపై స్టేట్ బ్యాంక్ కీలక నిర్ణయం!

  • క్రిప్టో కరెన్సీ కొనుగోలుకు ఎస్‌బీఐ అడ్డుకట్ట
  • క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలుపై నిషేధం
  • మాస్టర్, వీసా కార్డు సంస్థలతో చర్చలు

క్రిప్టో కరెన్సీ కొనుగోలు విషయంలో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌బీఐ వీసా, మాస్టర్ కార్డులను ఉపయోగించి బిట్ కాయిన్లను కొనుగోలు చేయడంపై నిషేధం విధించేందుకు రెడీ అయింది. బిట్‌కాయిన్ సహా ఇతర క్రిప్టో కరెన్సీని కొనుగోలు చేయడానికి డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించడంపై నిషేధం విధిస్తున్నట్టు సిటీబ్యాంకు ప్రకటించిన రెండు రోజులకే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

బిట్‌కాయిన్ లావాదేవీలపై ప్రభుత్వం, రిజర్వు బ్యాంకు ఆందోళన చెందుతున్నాయని, కాబట్టి ఇటువంటి వూహాజనిత కరెన్సీల లావాదేవీలకు అడ్డుకట్ట వేసేందుకు నిషేధం విధించాలని యోచిస్తున్నట్టు ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈవో హర్ దయాళ్ ప్రసాద్ పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ లావాదేవీలను అడ్డుకునేందుకు వీసా, మాస్టర్ కార్డు నెట్‌వర్క్‌లతో చర్చలు జరుపుతున్నట్టు హర్ దయాళ్ తెలిపారు.

బిట్‌కాయిన్ లావాదేవీలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇటీవల రిజర్వుబ్యాంకు అన్ని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగంలోనూ క్రిప్టో కరెన్సీ గురించి ప్రస్తావించారు. భారత్‌లో ఇది చట్టబద్ధం కాదని, లావాదేవీలు జరిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More Telugu News