ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాం.. కానీ రాజీనామా ఎప్పుడనేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది: టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్

15-02-2018 Thu 19:35
  • త‌మ ఎంపీలు రాజీనామాలు చేస్తారని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్య
  • ఆయనది వ్యక్తిగత అభిప్రాయం అన్న ఎమ్మెల్సీ
  • ఏపీ ప్రయోజనాల విషయంలో రాజీపడబోము

త‌మ ఎంపీలు వ‌చ్చేనెల 5న రాజీనామాలు చేస్తారని ఆంధ్రప్రదేశ్ మంత్రి, టీడీపీ నేత ఆదినారాయణ రెడ్డి ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమేనని, అయినప్పటికీ ఆయన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నామని అన్నారు. కానీ, తమ ఎంపీలు రాజీనామా ఎప్పుడు చేస్తారన్న విషయం అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో తాము రాజీపడబోమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాము వీలైనంత వరకు తమ ఆవేశాన్ని అణచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలను సాధించడానికి కృషి చేస్తామని అన్నారు. తమకు ఏ పదవులూ ముఖ్యం కాదని, కేంద్ర ప్రభుత్వం నుంచి చివరి ఆశ కూడా పోతే రాజీనామా చేస్తామని అన్నారు. ఆదినారాయణ ఆవేశానికి గురై రాజీనామా చేస్తామని మీడియాతో చెప్పినట్లున్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకుంటామని, జగన్‌లా వ్యక్తిగత అవసరాన్ని బట్టి తీసుకోబోమని వ్యాఖ్యానించారు.