China: అమెరికాను వదిలి చైనా పంచన చేరుతున్న పాకిస్థాన్‌తో పెను ముప్పు!: ట్రంప్ ప్రభుత్వానికి నిఘా సంస్థల వార్నింగ్

  • పాక్ చర్యతో దక్షిణాసియాలో అమెరికా ప్రయోజనాలకు ముప్పు
  • పాక్ గడ్డపై నుండి భారత్‌పై దాడులకు ఉగ్ర సంస్థల వ్యూహరచన
  • చైనా, పాక్‌లతో భారత్‍‌ సంబంధాలు ఉద్రిక్తమయ్యే అవకాశం

పాకిస్థాన్ క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనా పంచన చేరుతోందని పలు నిఘా సంస్థలు వెల్లడించాయి. ఈ ధోరణి అమెరికా ప్రయోజనాలకు ముప్పని హెచ్చరించాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ దినపత్రిక 'డాన్' పేర్కొంటూ, ఓ కథనాన్ని ప్రచురించింది. "అమెరికా ప్రభావం నుండి పాకిస్థాన్ క్రమంగా బయటపడుతూ 2019కి చైనాకి దగ్గరవుతుంది. తద్వారా ఆ దేశం దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పరిణమిస్తుంది.. అంటూ అమెరికాకు చెందిన 17 నిఘా సంస్థలు అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించాయి" అంటూ పాకిస్థాన్ దినపత్రిక 'డాన్' పేర్కొంది.

ఈ 17 నిఘా సంస్థలలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ), ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఎస్‌ఏ) వంటి సంస్థలు వున్నాయి. అధునాతన అణ్వాయుధ సామర్థ్యాలను పెంచుకోవడం, ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించడం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సహకారాన్ని అడ్డుకోవడం, చైనాకి చేరువకావడం ద్వారా అమెరికా ప్రయోజనాలకు ముప్పుగా పాకిస్థాన్ పరిణమించనుందని హెచ్చరించినట్టు డాన్ పత్రిక పేర్కొంది.

మరోవైపు ఉగ్రవాద సంస్థలు పాకిస్థాన్ గడ్డపై ఆశ్రయమేర్పరుచుకుని భారత్, ఆఫ్గనిస్థాన్ దేశాలపై దాడులకు వ్యూహరచన చేస్తాయని నిఘా సంస్థలు సదరు నివేదికలో పేర్కొన్నట్టు డాన్ తెలిపింది. అలాగే భారత్‌లో ఒకవేళ మరో భారీ ఉగ్రదాడి గనుక జరిగితే భారత్-పాకిస్థాన్ దేశాల నియంత్రణ రేఖ వెంట హింస కొనసాగుతుందని, తద్వారా ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటాయని ఆ రిపోర్ట్ వెల్లడించింది.

చైనాతోనూ భారతదేశ సంబంధాలు ఉద్రిక్తంగానే ఉంటాయని, కొన్నిసందర్భాల్లో మరింత దెబ్బతినే అవకాశముందని నిఘా సంస్థలు హెచ్చరించినట్లు 'డాన్' తెలిపింది. మరోపక్క, పాకిస్థాన్‌పై ఎవరైనా ఏకపక్ష చర్యకు దిగడం సరికాదని, అలా చేస్తే దానికి తాము తగు విధంగా స్పందించాల్సి ఉంటుందని ఆ దేశ హోం శాఖ మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్ సీఎన్ఎన్‌తో అన్నారు. తమ దేశం ఇప్పటివరకు దాదాపు 60వేల మందిని కోల్పోయిందని, తమ ఆర్థిక వ్యవస్థకు సుమారు 25 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తు చేశారు.

కాగా, అమెరికా నుండి ఒత్తిళ్ల నేపథ్యంలో గతవారం ఉగ్రవాది సయీద్‌కి చెందిన జుద్ సహా 27 ఉగ్ర సంస్థలపై నిషేధం విధిస్తూ పాకిస్థాన్ ఓ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News