goa: గోవా పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారేనన్న గోవా మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన పారికర్!

  • గోవా వ్యవసాయ శాఖ మంత్రి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు
  • ఆ మంత్రి లేవనెత్తిన విషయంలో తప్పులేదన్న గోవా సీఎం
  • కాకపోతే అటువంటి పదజాలం వాడటం సరైంది కాదని వ్యాఖ్య

తమ రాష్ట్ర పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే వారిపై గోవా వ్యవసాయ శాఖ మంత్రి విజయ్ సర్దేశాయ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవాకి వచ్చే పర్యాటకుల్లో చాలామంది పనికిమాలినవారేనని, తమ రాష్ట్రంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. గోవా జనాభా కంటే అక్కడికి ప్రతి ఏడాది వచ్చే పర్యాటకుల సంఖ్య ఆరు రెట్లు ఎక్కువని అన్నారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా ఆ విషయంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ స్పందించారు. తమ మంత్రి అటువంటి పదజాలం వాడటం సరైంది కాదేమోగానీ, విజయ్ సర్దేశాయ్‌ లేవనెత్తిన పాయింట్ మాత్రం సరైందేనని వ్యాఖ్యానించారు. తమ మంత్రి తాను చెప్పాలనుకున్నదాన్ని సరిగా చెప్పలేకపోయారని, ఇటీవల ఓ పర్యాటకుడు బస్సు కిటికీలో నుంచి మూత్ర విసర్జన చేశాడని, అందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిందని పారికర్ చెప్పారు.

దానిపై మాట్లాడుతూనే తమ మంత్రి ఇలా స్పందించారని పారికర్ వివరణ ఇచ్చారు. ఈ ఘటనపై ఆయనతో తాను మాట్లాడానని, అయినా, ఆ మంత్రి చెప్పినదాంట్లో తప్పేమీ లేదని అన్నారు. రాష్ట్రానికి ఎవరు వచ్చినా తాము స్వాగతిస్తామని చెప్పారు. అయితే, రోడ్లపై మూత్రవిసర్జన చేయకూడదని, పారిశుద్ధ్య సమస్యలను మరింత పెంచొద్దని అన్నారు.  

More Telugu News