Rajasthan: ఈ నేతలు మారరా? రోడ్డు పక్కన కాన్వాయ్ ఆపి గోడలపై రాజస్థాన్ మంత్రి మూత్ర విసర్జన... వైరల్ అవుతున్న ఫోటో!

  • జైపూర్ లో కారును ఆపించిన ఆరోగ్య మంత్రి కాళీచరణ్ సరాఫ్
  • ఆపై పక్కనే ఉన్న గోడ వద్దకు వెళ్లి మూత్ర విసర్జన
  • వైరల్ అవుతున్న ఫొటో
  • ఇదేమీ పెద్ద విషయం కాదంటున్న మంత్రి

ఇప్పటికే రాజస్థాన్ లో వసుంధరా రాజే ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతూ ఉంటే, ఇప్పుడు మరో మంత్రి చేసిన పని నెట్టింట వైరల్ అయి, ప్రభుత్వంపై విమర్శలను పెంచుతోంది. రాజస్థాన్ కు ఆరోగ్య మంత్రిగా ఉన్న కాళీచరణ్ సరాఫ్, తన కారును రోడ్డు పక్కన ఆపించి, పక్కనే ఉన్న ఓ గోడకు మూత్ర విసర్జన చేస్తున్న చిత్రాలు ఇప్పుడు జైపూర్ లో కలకలం రేపుతున్నాయి.

స్వచ్ఛ భారత్ అభియాన్ లో పోటీకి నిలిచిన జైపూర్ ను మరింత పరిశుభ్రం చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఎంతో శ్రమిస్తుంటే, స్వయంగా ఆరోగ్య మంత్రిగా ఉన్న సరాఫ్ ఈ పని చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజులు ఎవరైనా ఇలా బహిరంగంగా గోడలను తడిపితే రూ. 200 జరిమానా వేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రం ఏమీ చేయడం లేదని, ప్రజలు మారుతున్నా, ఈ నేతలు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, తన ఫోటో వైరల్ అవుతుండటంపై స్పందించిన సరాఫ్, ఇదేమీ అంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News