Telangana: ‘కృష్ణా’, ‘గోదావరి’లో మనకు దక్కాల్సిన వాటాపై గట్టిగా పోరాడాలి: మంత్రి హరీశ్ రావు

  • జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష
  • ‘పట్టిసీమ’లో 45 టీఎంసీల నీరు తెలంగాణ వాటా ఉంది
  • ‘కృష్ణా’లో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించాలి
  • ఢిల్లీలో రేపు జరగనున్న సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘ చర్చ

కృష్ణా, గోదావరి నదులలో తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాపై గట్టిగా పోరాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో గురువారం జరగనున్న సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగే విధంగా ఆంధ్రప్రదేశ్ చేసే ప్రతిపాదనలను ఎలా తిప్పికొట్టాలన్న అంశంపై, పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల జరిగే ముంపు సమస్యలపై చర్చించారు. జలసౌధలో ఇరిగేషన్ అధికారులతో ఈరోజు ఆయన సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, తెలంగాణలోని చారిత్రక భద్రాచలం శ్రీ సీతారామస్వామి దేవాలయం సహా పలు గ్రామాలు, బొగ్గు గనులు, మణుగూరు హెవీ వాటర్ ప్లాంట్ తదితర ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. భద్రాచలం పట్టణం దాని చుట్టుపక్కల గోదావరి పరీవాహక ప్రాంతంలో 124 కిలో మీటర్ల  మేరకు పోలవరం ప్రాజెక్టు ప్రభావం ఉంటుందని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ప్రభావిత ప్రాంతాలు, తలెత్తే సమస్యలపై అధ్యయనం చేయాలంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఆదేశించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉన్నతాధికారులను హరీశ్ రావు కోరారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరానికి కేంద్ర జల సంఘం అనుమతులు ఇచ్చిన తర్వాత నాగార్జునసాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలకు 45 టీఎంసీల నీటిని వినియోగించుకునే హక్కు దక్కుతుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం కేంద్రమే జాతీయ ప్రాజెక్టుగా పోలవరంను చేపట్టినందున ఆ 45 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించాలని కోరారు.

కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల కింద 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూములు ఉన్నప్పటికీ కేవలం 5.75 (15 శాతం ) లక్షల హెక్టార్ల భూమికి మాత్రమే సాగునీరు అందుతుందని, 45 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయిస్తే నీరందని ప్రాంతాల్లో సాగుకు వాడుకుంటామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కొత్తగా పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టి గోదావరి జలాలను వాడుకుంటున్నట్టు కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ఆదేశించారు.

పట్టిసీమ లోనూ 45 టీఎంసీల నీరు తెలంగాణ వాటా ఉందని, మొత్తంగా రెండు రాష్ట్రాలకు ‘కృష్ణా‘లో కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 575 టీఎంసీలు కేటాయించి ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలని గురువారం ఢిల్లీలో కేంద్రాన్ని కోరాలని ఆదేశించారు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్.డి.ఎస్) కింద రాష్ట్రానికి 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ వాస్తవంగా సగటున 4.56 టీఎంసీలకు మించి రావడం లేదని తెలిపారు.

 ఆర్.డి.ఎస్. కాలువల ఆధునికీకరణ చేపట్టాలని 2004 లో నిపుణుల కమిటీ సిఫారసు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో ఈ పనులు ముందుకు సాగలేదని, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా ఏపీ అనేక అడ్డంకులు సృష్టిస్తున్న విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని కోరారు. నిపుణుల కమిటీ గతంలో చేసిన సిఫారసుల మేరకు ఆర్.డి.ఎస్. ఆధునికీకరణ పనులు వేగవంతమయ్యేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని ఢిల్లీ సమావేశంలో కోరాలని ఆదేశించారు.

ఇక శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద నీటి వాడకాన్ని లెక్క గట్టేందుకు టెలిమెట్రీ స్టేషన్లు ఏర్పాటు చేయాలని 2016 జూన్ లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించినప్పటికీ కె.ఆర్.ఎం.బి. వాటిని అమలు చేయలేదని అన్నారు. తొలివిడతలో 19 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు 2017 ఫిబ్రవరిలో కె.ఆర్.ఎం.బి ప్రతిపాదించింది. కానీ, ఆ టెలిమెట్రీ స్టేషన్లు పని చేయడం లేదని హరీశ్ రావు అన్నారు. రెండో విడత టెలిమెట్రీ స్టేషన్ల జాబితాను ఇంతవరకు ఖరారు చేయకపోవడంపై తీవ్రంగా ఆక్షేపించారు. ముఖ్యమైన నీటి మళ్లింపు ప్రాంతాల వద్ద టెలిమెట్రీ స్టేషన్ ల ఏర్పాటులో జరుగుతున్న జాప్యం వల్ల పోతిరెడ్డిపాడు కింద అధిక నీటిని కృష్ణా బేసిన్ అవతలకు అక్రమంగా తరలిస్తున్నట్టు ఆరోపించారు.  

More Telugu News