hafiz sayeed: హఫీజ్ సయీద్ ఉగ్రవాదే... మొదటిసారిగా ప్రకటించిన పాకిస్థాన్!

  • ఈ మేరకు ఆర్డినెన్స్ పై పాక్ అధ్యక్షుడు సంతకం
  • అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్
  • నిషేధిత ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై చర్యలకు చట్టంలో సవరణలు

జమాత్ ఉద్ దవా సంస్థ అధినేత, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు, 2008 ముంబై నరమేధం సూత్రధారి హఫీజ్ సయీద్ ను ఇన్నాళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన పాకిస్థాన్... ఎట్టకేలకు అతడ్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రపంచ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ పని చేసింది. హఫీజ్ సయీద్ ను ఉగ్రవాదిగా పేర్కొంటూ రూపొందించిన ఆర్డినెన్స్ పై సోమవారం పాకిస్థాన్ అధ్యక్షుడు హుస్సేన్ సంతకం చేశారు.

ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపైనా చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ ఆర్డినెన్స్ లో యాంటీ టెర్రరిజం యాక్ట్ లో సవరణలు ప్రతిపాదించారు. హోంశాఖ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల శాఖ, నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ ఈ విషయంలో కలసి పనిచేస్తున్నాయని అధికార వర్గాలు ధ్రువీకరించాయి. పాకిస్థాన్ కు ధైర్యముంటే తనను ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ హఫీజ్ సయీద్ ఇటీవలే సవాల్ విసిరారు. ఇప్పుడు పాకిస్థాన్ అదే చేసి చూపించింది. మరి సయీద్ దీనికి ఎలా స్పందిస్తాడో చూడాలి.

More Telugu News