japan: జపాన్ లో భారీ బిట్ కాయిన్ దోపిడీపై నేడు నివేదిక... కోర్టులో కేసు వేయనున్న ట్రేడర్లు

  • గత నెలలో 530 మిలియన్ డాలర్ల క్రిప్టోకరెన్సీ దోపిడీ
  • తర్వాత అన్ని ఉపసంహరణలు నిలిపివేసిన కాయిన్ చెక్
  • దీన్ని కోర్టులో సవాలు చేయనున్న ట్రేడర్లు

జపాన్ కు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్చేంజ్ కాయిన్ చెక్ లో గత నెలలో హ్యాకింగ్ జరిగి, 530 మిలియన్ డాలర్ల విలువైన డిజిటల్ కరెన్సీ దోపిడీకి గురైన ఘటనపై నేడు నియంత్రణ సంస్థకు నివేదిక అందనుంది. ఫిబ్రవరి 13 నాటికి నివేదిక సమర్పించాలని ఫెడరల్ సర్వీసెస్ ఏజెన్సీ లోగడ ఆదేశించింది. ఆ గడువు నేటితో ముగియనుంది. ఎక్చేంజ్ ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని, మరోసారి ఈ ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏజెన్సీ కోరింది.

ఇక గత నెలలో హ్యాకింగ్, దోపిడీ తర్వాత అన్ని ఉపసంహరణలను కాయిన్ చెక్ నిలిపివేసింది. ఈ నెల 13 నుంచి ఉపసంహరణలను యథావిధిగా అనుమతించనున్నట్టు ప్రకటించింది. కాగా, ఇంత కాలం తమ క్రిప్టోకరెన్సీలను నిలిపివేయడంపై పది మంది ట్రేడర్లు టోక్యో డిస్ట్రిక్ట్ కోర్టులో గురువారం వ్యాజ్యం దాఖలు చేయనున్నారు. వెనక్కి తీసుకోకుండా నిలిపివేయడం వల్ల కలిగిన నష్టాన్ని చెల్లించాలని కూడా మరో వ్యాజ్యం దాఖలు చేయనున్నారు.

More Telugu News