Parbati Ghosh: సీనియర్ ఒరియా సినీ నటి పార్వతీ ఘోష్ కన్నుమూత

  • శోకసంద్రంలో ఒడిశా సినీ పరిశ్రమ
  • నివాళులర్పించిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
  • అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ఒరియా చలన చిత్ర రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన సీనియర్ నటి పార్వతీ ఘోష్ (85) ఆదివారం అర్ధరాత్రి కన్నుమూశారు. భువనేశ్వర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. విషయం తెలిసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భువనేశ్వర్‌లోని ఆమె నివాసానికి వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగం అభివృద్ధికి ఆమె చేసిన కృషిని గుర్తు చేసుకుని కొనియాడారు. ఒరియా సినీ రంగంలో తొలి మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన ఆమె అందరికీ ఆదర్శప్రాయులన్నారు. అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు వచ్చాక అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు చెప్పారు.

మార్చి 28, 1933లో కటక్‌లో జన్మించిన పార్వతీ ఘోష్ 16 ఏళ్ల వయసులో ‘శ్రీ జగన్నాథ్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలో కాలుమోపారు. ఆ తర్వాత పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానుల మనసుల్లో  సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు.

More Telugu News