Meghalaya: విచిత్రం! మేఘాలయ ఎన్నికల్లో ఓటేయనున్న ఇటలీ, అర్జెంటీనా, స్వీడన్, గోవా, త్రిపుర, స్వీట్‌హార్ట్!

  • ఈనెల 27న మేఘాలయ శాసనసభ ఎన్నికలు
  • ఖాసీ జిల్లా ఓటర్లకు విచిత్రమైన పేర్లు
  • దేశాలు, వారాలు, ఇంగ్లిష్ పదాలను పేర్లుగా పెట్టుకుంటున్న యువత

దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో ఓటేయాలన్నా తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. మరి విదేశీయులు ఓటెలా వేస్తారు? అనేగా మీ సందేహం. ఈ నెల 27న మేఘాలయ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇటలీ, అర్జెంటీనా, స్వీడన్, ఇండోనేషియాలు ఓటు హక్కును వినియోగించుకోనున్నాయి. అయితే ఇందులో అంతగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మనదేశంలో వారికి ఎలా ఓటు హక్కు వచ్చిందని బుర్ర బద్దలుగొట్టుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆ పేర్లు దేశాలవి కావు.. ఆ రాష్ట్రంలోని ఓటర్లవి. షెల్లా నియోజకవర్గంలోని తూర్పు ఖాసి జిల్లా, ఉమినియహ్-టిమార్ ఎలాక గ్రామంలోని నివసిస్తున్న వారిలో కొందరి ఓటర్ల పేర్లివి.

‘‘ఖాసీ తెగ ప్రజల పేర్లను చూస్తే నవ్వొస్తుంది. అయితే వందలాది మంది ఇలా విచిత్రమైన పేర్లను పెట్టుకుంటారు’’ అని ఎలాక సర్పంచ్ (సిర్దార్) ప్రీమియర్ సింగ్ తెలిపారు. దాదాపు 50 శాతం మంది ఇటువంటి పేర్లతోనే కనిపిస్తుంటారని ఆయన పేర్కొన్నారు. ఇంగ్లిష్ పదాలు, పద్యాల పేర్లు, వారాలు, రాష్ట్రాల పేర్లు కూడా పెట్టుకుంటారని వివరించారు.

బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉండే ఈ గ్రామంలో 850 మంది పురుష ఓటర్లు, 916 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తనకు మాత్రం తన తండ్రి ‘ప్రీమియర్’ అని చక్కని పేరు పెట్టారని సర్పంచ్ ఆనందం వ్యక్తం చేశారు. ఆదివారం, గురువారం, గోవా, త్రిపుర అనే పేర్లు కూడా ఇక్కడ కనిపిస్తుంటాయి. ఇక ఇక్కడ బెస్ట్ ఇంగ్లిష్ పేరు ‘స్వీట్ హార్ట్’. ఈ గ్రామంలో ఉన్న ముగ్గురు అక్కాచెల్లెళ్ల పేర్లు వరుసగా ‘రిక్వెస్ట్’, ‘లవ్లీనెస్’, ‘హ్యాపీనెస్’. వారి తల్లి పేరు ‘షుకి’. ఖాసీ భాషలో ఈ పదానికి అర్థం కుర్చీ అని.

More Telugu News