Hyderabad: తాను రాసిన లేఖను వెలుగులోకి తెచ్చేందుకు కూకట్ పల్లిలో ఏటీఎం యంత్రాన్ని దహనం చేసిన యువకుడు!

  • ఒకటో ఫేజ్ లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎం దహనం
  • 17 పేజీల లేఖ రాసిన యువకుడు
  • లేఖలో పలు సూచనలు, సలహాలు

సమాజం పట్ల తన మనసులో వున్న భావాలను వెల్లడించేందుకు ఓ యువకుడు ఎంచుకున్న మార్గం హైదరాబాదులో కలకలం రేపింది. తన భావాలను బహిరంగ లేఖ ద్వారా వెలుగులోకి తెచ్చేందుకు పాతికేళ్ల యువకుడు ఓ ఏటీఎం యంత్రాన్ని తగులబెట్టాడు. పోలీసులు వెల్లడించిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒకటో ఫేజ్ లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఏటీఎంలోకి తెల్లవారుజామున 3.25 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి ముఖానికి రుమాలు కట్టుకుని ఒక కవర్ తో ప్రవేశించాడు.

ఏటీఎం గదిలోని సీసీకెమెరాకు తన చేతిలోని లేఖను చూపించాడు. అనంతరం ఆ లెటర్ ను, ఓ కవర్ ను ఏటీఎంపై పెట్టి, అందులో ఉంచిన కేబుల్ తీసి దానిని బయటవరకు తెచ్చాడు. ఈ కేబుల్ ద్వారా కవర్ లో ఉంచిన మిశ్రమానికి మంట వ్యాపించేలా చేశాడు. ఆ మిశ్రమం అంటుకోవడంతో ఏటీఎం మిషీన్ డిస్‌ ప్లే, గదిలోని రెండు సీసీ కెమేరాలు కాలిపోయాయి. ఈ విజువల్స్ కెమేరాలు ధ్వంసం కాకముందు నమోదయ్యాయి.

 ఆ వ్యక్తి రాసిన 17 పేజీల ఆ లేఖ మాత్రం భద్రంగా ఉండడం విశేషం. ప్రపంచంలోని ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటిని పరిష్కరించాలని ఆ లేఖలో డిమాండ్ చేశాడు. ప్రపంచంలోని ప్రజలందరికీ ఒకే గుర్తింపు కార్డు ఉండాలని సూచించాడు, కులమత భేదాలతో పాటు రిజర్వేషన్లు ఉండకూడదని వ్యాఖ్యానించాడు. ఆకలిచావులు అరికట్టే బాధ్యత ప్రభుత్వాలదేనని స్పష్టం చేశాడు. విద్య, వైద్యం, శాంతిభద్రతల వ్యవస్థలు మెరుగుపడాల్సి ఉందని, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేశాడు. మహిళలపై అత్యాచారాలను నివారించాలంటే వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలన్నాడు. తాను రాసిన లేఖను 24 గంటల్లోపు మీడియాలో ప్రచురించాలని, లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చేపట్టారు.

More Telugu News