Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలకు వెళ్లొద్దు.. హెచ్చరిస్తున్న పర్యావరణవేత్తలు!

  • కాలుష్య మెట్రో నగరాల్లో భాగ్యనగరానికి నాలుగో స్థానం
  • జాబితాలో అగ్రస్థానంలో ఢిల్లీ
  • గాలిలో మోతాదుకు మించి ధూళి కణాలు
  • భాగ్యనగరంలో తిరగాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌లోని బాలానగర్, జీడిమెట్ల, పంజగుట్ట, ఉప్పల్, ప్యారడైజ్, జూబ్లీహిల్స్, నాంపల్లి, ఎంజీబీఎస్, చార్మినార్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, మాదాపూర్, హైటెక్ సిటీ, మల్లాపూర్, నాచారం, అబిడ్స్, హెచ్‌సీయూ, గచ్చిబౌలి, మెహదీపట్నం, దిల్‌సుఖ్ నగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బంజారాహిల్స్.. హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాలు ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునేవారు ఈ ప్రాంతాలకు వీలైనంత దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేదంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ ప్రాంతాల్లో అడుగుపెట్టడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.

కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న భాగ్యనగరంలో వాహనాల వల్ల గాలిలో బెంజీన్, టోలిన్, అమ్మోనియా, నైట్రోజన్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌లు పరిమితి మించిపోతున్నాయి. ప్రతి ఘనపు మీటరు గాలిలో 60 మైక్రో గ్రాములకు మించకుండా ఉండాల్సిన సూక్ష్మ, స్థూల ధూళి కణాల మోతాదు 100 మైక్రోగ్రాములకు చేరుకుంది. ఫలితంగా దేశంలోని వాయుకాలుష్య మెట్రో నగరాల్లో హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఢిల్లీ ఉండగా,  తర్వాతి స్థానంలో ముంబై, కోల్‌కతాలు ఉన్నాయి.

హైదరాబాద్‌లో వాయుకాలుష్యాన్ని లెక్కించి  ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసేందుకు జీడిమెట్ల, పాశమైలారం, హెచ్‌సీయూ, జూపార్క్ వద్ద కంటిన్యూయస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సెంటర్లు ఉన్నాయి. వీటితో పాటు వివిధ ప్రాంతాల్లో నమోదయ్యే వాయుకాలుష్య నమూనాలను సేకరించి సనత్ నగర్‌లోని పీసీబీ కేంద్ర కార్యాలయంలోని ల్యాబ్‌లో పరీక్షిస్తున్నారు. ఈ ఫలితాలను ఎప్పుడో ఓసారి పరీక్షిస్తుండడంతో ఆయా ప్రాంతాల్లోని కాలుష్యం ఎప్పుడు ఎంత ఉంటుందో తెలుసుకోవడం ప్రజలకు ఇబ్బందిగా మారుతోంది. ఇతర మెట్రో నగరాల్లోని ప్రధాన కూడళ్లలో కాలుష్య మోతాదును పౌరులు తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే యంత్రాలు ఉన్నాయి. వీటిని గ్రేటర్ పరిధిలోనూ ఏర్పాటు చేయాలని పర్యావరణ వేత్తలు కోరుతున్నారు.

More Telugu News