PM Modi: విద్యార్థులకు పరీక్షలు తేలిగ్గా ఉండాలి : యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్

  • యూపీ బోర్డు పరీక్షలకు పదిలక్షల మంది విద్యార్థుల డుమ్మా
  • ఇలాగైతే భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని సీఎం ఆందోళన
  • 'ఎగ్జామ్ వారియర్స్' పుస్తకంతో స్టూడెంట్లకు ప్రయోజనమని వెల్లడి

విద్యార్థులకు పరీక్షలు సులువుగా ఉండటం వల్ల వారు భయపడకుండా రాస్తారని, ఈ దిశగా దృష్టి సారించనున్నామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ చెప్పారు. ఆ రాష్ట్ర విద్యా శాఖ బోర్డు నిర్వహించిన పరీక్షలకు గత నాలుగు రోజుల్లో దాదాపు పది లక్షల మంది విద్యార్థులు గైర్హాజరయిన నేపథ్యంలో ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మోసాలకు తావులేకుండా పరీక్షల పర్యవేక్షణను అత్యంత కట్టుదిట్టంగా చేపట్టడం కూడా విద్యార్థుల గైర్హాజరుకు కారణంగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

"చీటింగ్‌కు అవకాశం లేకుండా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించగానే పది లక్షల మంది విద్యార్థులు భయంతో పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఇది ఇప్పటివరకు తేలిక లెక్క. ఇలాగైతే భవిష్యత్తులో ఏమి జరుగుతుందో నాకు తెలియడం లేదు" అని ఆయన ఆందోళనతో కూడిన ఆవేదనను వ్యక్తం చేశారు.

విద్యార్థులకు దోహదపడేలా ప్రధాని రూపొందించిన 'ఎగ్జామ్ వారియర్స్' అనే పుస్తకం హిందీ ఎడిషన్‌ను ఆవిష్కరించిన అనంతరం యోగి మాట్లాడారు. పరీక్షలంటే విద్యార్థులకు భయమేస్తోందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అందువల్ల ఈ పుస్తకం విద్యార్థుల్లో పరీక్షలపై ఉన్న భయాన్ని పోగొట్టేలా వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి దోహదపడగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పరీక్షలను మరింత సులువుగా మార్చడంపై దృష్టి సారించాల్సిన అవసరముందని ఆయన చెప్పారు.

More Telugu News