2019 Lok Sabha elections: మోదీ మళ్లీ ప్రధానైతే దేశంలో రాష్ట్రపతి పాలనే!: హార్దిక్ పటేల్

  • విద్య, ఉపాధిపై మాట్లాడే ప్రధాని కావాలని ఆకాంక్ష
  • దేశాన్ని విడదీసే శక్తిపై ఐక్య పోరాటానికి పిలుపు
  • మమత బెనర్జీ 'లేడీ మహాత్మా' అంటూ కితాబు

వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినట్లయితే దేశంలో రాష్ట్రపతి పాలనే గతి అని పటీదార్ రిజర్వేషన్ల కోసం పారాడుతున్న హార్దిక్ పటేల్ వ్యాఖ్యానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం మోదీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తే ఎన్డీయేతర ప్రభుత్వాలు విచ్ఛిన్నమవుతాయనే ఉద్దేశంతో పటేల్ ఇలా 'రాష్ట్రపతి పాలన' అనే మాటను వాటినట్లు తెలుస్తోంది.

దేశాన్ని విడదీయాలని ప్రయత్నిస్తున్న శక్తి (పరోక్షంగా బీజేపీ పాలనను ఉద్దేశించి)ని ఎదుర్కొనేలా అన్ని పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన నొక్కిచెప్పారు. "2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో తిరిగి మోదీ ప్రభుత్వమే అధికారంలోకి గనుక వస్తే, దేశంలో రాష్ట్రపతి పాలనను స్వాగతించినట్టేనని నేను స్పష్టంగా చెప్పాను" అని ఆయన మీడియాతో అన్నారు.

మరోవైపు మోదీ పార్లమెంటులో ఇటీవల చేసిన ప్రసంగాన్ని కూడా హార్దిక్ తీవ్రంగా విమర్శించారు. "విద్య, ఉపాధి, వ్యవసాయం, ఆరోగ్యం, దేశ భధ్రత లేదా రక్షణ గురించి మాడ్లాడే ప్రధానమంత్రిని నేను చూడాలనుకుంటున్నాను. కానీ, మన ప్రధాని పార్లమెంటులో చేసిన 90 నిమిషాల ప్రసంగంలో విపక్ష కాంగ్రెస్‌ని దూషించడానికే ప్రాధాన్యతను ఇచ్చారు" అని పటేల్ విమర్శించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మాత్రం పొగడ్తలతో ముంచెత్తారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఎంతో పేరున్నా సరే ఆమె చాలా 'సింపుల్'గా ఉండటం మెచ్చుకోదగ్గ విషయమని ఆయన అన్నారు. ఆమెను 'లేడీ మహాత్మ'గా ఆయన అభివర్ణించారు. ఆమెతో ఇటీవల రాష్ట్ర సచివాలయంలో భేటీ అయిన సందర్భంగా ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నానని ఆయన చెప్పారు. గుజరాత్‌ రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలను దగ్గరుండి చూసుకునే విధంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చేరాలని తనను మమత ఆహ్వానించారని కూడా ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News