Vistara: గగనతలంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం!

  • తప్పిన ఎయిరిండియా-విస్తారా విమానాల ఢీ
  • ఊపిరిపీల్చుకున్న ప్రయాణికులు
  • పైలట్లు నిర్దేశిత ఎత్తును పాటించడంలో అయోమయం
  • ఘటనపై దర్యాప్తు చేపట్టామన్న డీజీసీఏ అధికారి

అధికారుల సమయస్ఫూర్తి, అప్రమత్తతతో ఈ నెల 7న గగనతలంలో ఎదురెదురుగా వస్తున్న రెండు విమానాల మధ్య పెను ప్రమాదం తృటిలో తప్పింది. గత బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ముంబై గగనతలంపై సంభవించిన ఈ ఘటన వివరాల్లోకెళితే, ఎయిరిండియాకి చెందిన ఎయిర్‌బస్ 'ఏ-319' విమానం ఏఐ 631 పేరుతో 27 వేల అడుగుల ఎత్తులో ముంబై నుంచి భోపాల్ వెళుతోంది.

అదే సమయంలో విస్తారాకి చెందిన 'ఏ-320' నియో విమానం 152 మంది ప్రయాణికులతో యూకే 997 పేరుతో ఢిల్లీ నుంచి పూణే వెళుతోంది. 29 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించాలని ఈ విమానానికి ఆదేశాలిచ్చారు. కానీ, యూకే 997 విమానం 27,100 అడుగుల ఎత్తుకు దిగింది. దాంతో ఈ రెండు విమానాల మధ్య తేడా ప్రమాదకరమైన రీతిలో 100 అడుగులకు తగ్గిపోయింది. ఆ సమయంలో ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (టీసీఏఎస్) రెండు విమానాలకు హెచ్చరికలు పంపింది. దాంతో పైలట్లు అప్రమత్తమై పెను ప్రమాదాన్ని తప్పించారు.

"ఒకానొక సందర్భంలో, ఏఐ 631, యూకే 997 విమానాలు కేవలం వంద అడుగుల తేడాతో అభిముఖంగా, 2.8 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నాయి. సెకన్ల తేడాలో అవి రెండూ ఢీకొనే ప్రమాదం తృటిలో తప్పింది. ఇటీవలి కాలంలో ఇది ఒకానొక అత్యంత ప్రమాదకరమైన సందర్భం అనే చెప్పాలి" అని ఓ అధికారి అన్నారు.

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, "నిజంగానే ఇదొక అత్యంత ప్రమాదకరమైన ఘటనే. మా సిబ్బంది నిబంధనలు, ఆదేశాలను కచ్చితంగా పాటించారు. కానీ, ఈ ఘటనకు కారణం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, విస్తారా పైలట్ల మధ్య నెలకొన్న అయోమయమే" అని ఆయన సమర్థించుకున్నారు.

కాగా, ఇదొక తృటిలో తప్పిన అత్యంత ప్రమాదకరమైన ఘటన అని, దీనిపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) దర్యాప్తు చేపడుతోందని డీజీసీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News