Election Commission: ఆ నేతలపై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం: సుప్రీంకోర్టును కోరిన ఎన్నికల కమిషన్

  • ఐదేళ్ల శిక్ష పడే కేసుల్లో నిందితులైతే ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం
  • చట్ట సవరణ దిశగా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్
  • ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు కేసు నమోదు కావాలని క్లాజ్

రాజకీయాల నుంచి నేర చరితులను సమూలంగా తొలగించేందుకు చర్యలు తీసుకోవాల్సి వుందని, కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే కేసుల్లో ఆరోపణలను ఎదుర్కొంటున్న నేతలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును కోరింది. తీవ్రమైన నేరాలు చేసి, ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు రిజిస్టర్ అయిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిని పోటీ పడకుండా చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఈసీ కోరింది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఓ అఫిడవిట్ ను దాఖలు చేసింది. ప్రత్యర్థి రాజకీయ నేతలను కొన్నిమార్లు కావాలనే ఇరికిస్తున్నందున ఆరు నెలల నిబంధన పెట్టినట్టు పేర్కొంది.

 కాగా, ఈసీ అఫిడవిట్ రాజ్యాంగ పరిధులను దాటి ఉన్నందున, పార్లమెంటులో చట్టాన్ని చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించడం అంత సులభమేమీ కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈసీ సూచనలతో కేంద్రంపై మరింత ఒత్తిడి వస్తుందని భావిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కరవైందని, ఎన్నికల్లో అంగ, అర్థబలాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ఈసీ తన అఫిడవిట్ లో పేర్కొంది.

More Telugu News