India: కొత్త చరిత్ర... జోర్డాన్ ఇచ్చిన చాపర్ లో పాలస్తీనాకు మోదీ వెళుతుంటే, కాపలాగా ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్!

  • జోర్డాన్ నుంచి వాయు మార్గంలో పాలస్తీనాకు వెళ్లిన మోదీ
  • మధ్యలో ఇజ్రాయిల్ ను దాటిన మోదీ చాపర్
  • రక్షణగా నిలిచిన ఇజ్రాయిల్ వాయుసేన
  • కొత్త చరిత్ర సృష్టించామన్న విదేశాంగ శాఖ

తన పాలస్తీనా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఓ సరికొత్త చరిత్ర సృష్టించారు. తొలుత జోర్డాన్ లో పర్యటించిన మోదీ, ఆపై పాలస్తీనాకు బయలుదేరారు. జోర్డాన్ నుంచి పాలస్తీనా చేరుకోవాలంటే, నేతలు ఎవరైనా ఇజ్రాయిల్ మీదుగా రోడ్డుమార్గం గుండా సాగుతారు. కానీ, నరేంద్ర మోదీ, జోర్డాన్ ప్రభుత్వం ఇచ్చిన హెలికాప్టర్ లో పాలస్తీనాలోని రమల్లాకు చేరుకున్నారు.

ఈ హెలికాప్టర్ కు ఇజ్రాయిల్ ఎయిర్ ఫోర్స్ చాపర్లు రక్షణగా నిలిచి తమ దేశాన్ని దాటించాయి. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య దీర్ఘకాలంగా శత్రుత్వం నడుస్తుండగా, మోదీ పర్యటన ఆ విభేదాలను పక్కనబెట్టేలా చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ వ్యాఖ్యానించారు. మోదీ కొత్త చరిత్ర సృష్టించారని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ, మోదీ చాపర్ ప్రయాణిస్తున్న వీడియోను పంచుకున్నారు.

దాదాపు 150 కిలోమీటర్ల దూరాన్ని మోదీ హెలికాప్టర్ లో ప్రయాణించగా, జోర్డాన్, ఇజ్రాయిల్, పాలస్తీనా ఎయిర్ స్పేస్ ను ఖాళీ చేయించిన మూడు దేశాల ప్రభుత్వాలు, సరిహద్దుల వద్ద భారీ భద్రతను, క్షిపణి విధ్వంసక యంత్రాలను మోహరించడం గమనార్హం. నరేంద్ర మోదీ చాపర్ లో వెళుతుంటే, రక్షణగా నిలిచిన మరో చాపర్ నుంచి తీసిన వీడియోను మీరూ చూడవచ్చు. పాలస్తీనాలో పర్యటన తరువాత నరేంద్ర మోదీ గత రాత్రి అబూదాబి చేరుకున్నారు. 

More Telugu News