army camp: కశ్మీర్లో ఆర్మీ క్యాంప్ పై టెర్రరిస్టుల దాడి.. కొనసాగుతున్న ఆపరేషన్!

  • టెర్రరిస్టుల కాల్పుల్లో హవాల్దార్, అతని కుమార్తెకు గాయాలు
  • భారీగా మోహరించిన సైన్యం
  • రెసిడెన్షియల్ క్వార్టర్స్ ను కార్నర్ చేసుకున్న ముష్కరులు

జమ్ముకశ్మీర్ లోని సంజావన్ ఆర్మీ క్యాంప్ పై ఈ ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. విచక్షణారహితంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక హవాల్దార్, అతని కుమార్తె గాయపడ్డారు. ఘటన జరిగిన వెంటనే సైనికులు ఆ ప్రాంతాన్నంతా అధీనంలోకి తీసుకున్నారు. క్యాంప్ కు చుట్టుపక్కల ఉన్న స్కూళ్లన్నింటినీ మూసివేయాలని జిల్లా అధికారులు ఆదేశాలను జారీ చేశారు.

జైషే మొహమ్మద్ టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఆర్మీ క్యాంప్ పై ఈ ఏడాదిలో ఉగ్రవాదులు జరిపిన తొలి దాడి ఇదే. జమ్ము-పఠాన్ కోట్ హైవేపై కొన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంప్ ఉంది. క్యాంప్ లో ఆర్మీ క్వార్టర్సే కాకుండా స్కూళ్లు కూడా ఉన్నాయి. క్యాంప్ వెనుక భాగం నుంచి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఘటన నేపథ్యంలో క్యాంప్ ఎంట్రన్స్, ఎగ్జిట్ పాయింట్ల వద్ద భారీ ఎత్తున సైన్యం మోహరించింది. జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడులు జరగవచ్చనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇప్పటికే ఉన్నప్పటికీ, వారు నిర్దిష్టంగా ఎక్కడ అటాక్ చేయబోతున్నారనే సమాచారం మాత్రం లేదు. అంతర్జాతీయ సరిహద్దుకు జమ్ము ఆనుకుని ఉండటం వల్ల... టెర్రరిస్టులు తప్పించుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి.

ఈ తెల్లవారుజామున 4.55 గంటలకు అనుమానాస్పద వ్యక్తుల (టెర్రరిస్టులు)ను గుర్తించడం జరిగింది. బంకర్ వద్ద ఉన్న సెంట్రీ సదరు అనుమానాస్పద వ్యక్తులపై కాల్పులు జరిపాడు. ఈ నేపథ్యంలో, ఓ క్వార్టర్ ను టెర్రరిస్టులు కార్నర్ చేశారు. వారు జరిపిన కాల్పుల్లో హవాల్దార్ తో పాటు ఆయన కుమార్తె గాయపడింది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని జమ్ము ఐజీ ఎస్డీ సింగ్ తెలిపారు. అయితే, ఎంతమంది టెర్రరిస్టులు చొరబడ్డారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు. పదేళ్ల క్రితం ఇదే స్టేషన్ పై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు భారీ సంఖ్యలో జవాన్లు మృతి చెందారు.  

More Telugu News