KTR: కేటీఆర్ తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టారు: తలసాని శ్రీనివాస్ యాదవ్

  • కేటీఆర్ సవాల్ కు ఉత్తమ్ నేరుగా స్పందించలేదు
  • కాంగ్రెస్ కంటే 100 రెట్లు మెరుగ్గా కేసీఆర్ పాలిస్తున్నారు
  • 70 కాదు 7 సీట్లు గెలవండి చాలు

రానున్న ఎన్నికల్లో 70 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నేతలు బీరాలు పలుకుతున్నారని... కనీసం ఏడు సీట్లు గెలవండి చాలు అంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సవాల్ విసిరారు. గడ్డాలు, మీసాలు పెంచుకుంటే గెలుస్తామనుకోవడం కేవలం భ్రమే అవుతుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కంటే వంద రెట్లు గొప్పగా కేసీఆర్ పరిపాలిస్తున్నారని... కేవలం ఈర్ష్యతోనే కాంగ్రెస్ నేతలు విమర్శలను గుప్పిస్తున్నారని అన్నారు. గొర్రెలు, మేకలు పంచుతున్నారంటూ విమర్శిస్తున్న నేతలు యాదవుల దగ్గరకు వెళ్తే, వారే బుద్ధి చెబుతారని తెలిపారు.

ఉత్తమ్ కు కేటీఆర్ విసిరిన సవాల్ ను ప్రస్తావిస్తూ... రిటైర్మెంట్ దశలో ఉన్న ఉత్తమ్ కుమార్ కు, తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టి కేటీఆర్ సవాల్ విసిరారని తలసాని అన్నారు. అయితే, ఈ సవాల్ కు ఉత్తమ్ నేరుగా స్పందించలేకపోయారని ఎద్దేవా చేశారు. పోరాటాల వల్లే తెలంగాణ వచ్చిందని... తమ వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవాలని చెప్పారు.

మిత్రపక్షాలను మోసం చేసిన చరిత్ర బీజేపీదని విమర్శించారు. ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా కనీసం ఇప్పుడున్న సీట్లనైనా గెలవగలరా? అంటూ బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే రాజకీయాలను వదిలేస్తానని.. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే మీరు కూడా రాజకీయ సన్యాసం చేస్తారా? అంటూ ఉత్తమ్ కు కేటీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

More Telugu News