avanthi srinivas: కాంగ్రెస్ కు పట్టిన గతి మీకు పట్టకుండా చూసుకోండి: బీజేపీపై టీడీపీ ఎంపీ అవంతీ శ్రీనివాస్ ఫైర్

  • పద్మావత్ సినిమాలో హీరోను విలన్ మోసం చేసినట్టుంది
  • ఏపీ ప్రజలు సహనం కోల్పోతే ఏం జరుగుతుందో గుర్తుంచుకోండి
  • బీజేపీతో లాలూచీ పడాల్సిన ఖర్మ మాకు లేదు

పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనపై ఏపీ ఎంపీలందరూ అసంతృప్తిగా ఉన్నారని టీడీపీ ఎంపీ అవంతీ శ్రీనివాస్ అన్నారు. ఈ ఉదయం ఆయన ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ, అన్ని విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. పద్మావత్ సినిమాలో హీరోను విలన్ మోసం చేసినట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. ప్రతిసారి చర్చలకు పిలిచి, మోసం చేశారని మండిపడ్డారు. ఏపీ ప్రజలు ఒక్కసారి సహనం కోల్పోతే ఏం జరుగుతోందో గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే మీకు కూడా పట్టకుండా చూసుకోవాలని హెచ్చరించారు.

తమకు హైకమాండ్ ప్రజలే అని అవంతీ అన్నారు. రైల్వే జోన్ గురించి ఏపీ బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. విభజన చట్టంలో ఉన్నవాటినే తాము అడుగుతున్నామని, అంతకు మించి ఏదీ అడగడం లేదని చెప్పారు. ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా చూద్దాం, చేద్దాం అని సమయం గడిపేస్తున్నారని విమర్శించారు.

తమకు లిప్ సింపతీ అవసరం లేదని అన్నారు. బీజేపీతో లాలూచీ పడాల్సిన ఖర్మ తమకు లేదని చెప్పారు. తమకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ ఎంపీ కవితకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. తెలుగు ప్రజలంతా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, కలిసే ఉంటారని చెప్పారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రయోజనాల కోసం కూడా తాము పోరాటం చేస్తామని అన్నారు. 

More Telugu News