Parliament: రాజ్యసభలో కేవీపీతో జతకలిసిన సీఎం రమేష్, టీజీ వెంకటేష్... లైవ్ లో చూపవద్దన్న వెంకయ్య!

  • గత నాలుగు రోజులుగా వెల్ లో కేవీపీ ఒంటరి పోరు
  • నేడు జతకలిసిన టీడీపీ ఎంపీలు
  • తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన వెంకయ్యనాయుడు
  • మధ్యాహ్నం ఒంటి గంట వరకూ సభ వాయిదా

గడచిన నాలుగు రోజులుగా రాజ్యసభలో ఒంటరిగా వెల్ లో నిలబడి, ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావుకు, నేడు తెలుగుదేశం సభ్యుల నుంచి అనూహ్య స్పందన లభించింది. టీడీపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మోహన్ రావు తదితరులు వెల్ లోకి వచ్చి నినాదాలు చేశారు. నలుగురు సభ్యులు వెల్ లో నిలవడంతో, సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

తనకు జీరో అవర్, క్వశ్చన్ అవర్ సాగడమే ముఖ్యమని వ్యాఖ్యానించిన చైర్మన్ వెంకయ్యనాయుడు, సభ్యులను సముదాయించేందుకు ప్రయత్నించారు. ఆపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, సభ్యులు చేస్తున్న ఈ తరహా నిరసనలను ప్రజలు చూడాలని తాను భావించడం లేదని చెప్పారు. వారివైపు కెమెరాలు తిప్పవద్దని ఆదేశించారు. ఇది పార్లమెంట్ సంప్రదాయాలకు వ్యతిరేకమని, తన సూచనలను పాటించాలని, లేకుంటే తన ముందు వారిని సస్పెండ్ చేయడం లేదా సభను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేదని అన్నారు. అపై సభను మధ్యాహ్నం ఒంటిగంట వరకూ వాయిదా వేస్తున్నట్టు వెంకయ్యనాయుడు ప్రకటించారు.

More Telugu News