Sibal: ఆ గుర్తింపుకు మనం గర్వపడాలి కదా?: 'ఆధార్' వాదనల సందర్భంగా సుప్రీం

  • ఈ ఆలోచన రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటును తేల్చాలి
  • డేటా భద్రతకు వందశాతం భరోసా ఎవరూ ఇవ్వలేరు
  • ఆధార్ లేకపోయినా అందరూ భారతీయులేనని స్పష్టీకరణ

'ఒకే దేశం... ఒకే గుర్తింపు' ఆలోచన పూర్తిగా తప్పని, ఈ ఆలోచనకు ఉన్న రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటును నిర్థారించాలని పశ్చిమబెంగాల్ తరపు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ బుధవారం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. దాంతో ఈ ఆలోచన వల్ల తప్పేంటి? అని కోర్టు ప్రశ్నించింది. ఆధార్ పౌరుల గోప్యతకు భంగం కల్గిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కోర్టులో విచారణ మొదలైంది.

 ఈ సందర్భంగా ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ ఆశోక్ భూషణ్ మాట్లాడుతూ...ఈ ఆలోచనతో తప్పేంటి? మనమంతా భారతీయులం. ఆ గుర్తింపుకు మనం గర్వపడాలి కదా? అని అడిగిన దానికి సిబాల్‌ బదులిస్తూ...ఈ ఆలోచన పూర్తిగా తప్పనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై కోర్టులో చర్చకు వెళ్లరాదని ఆయన అన్నారు.

ఒక భారతీయుడిగా గర్వపడటం వరకు బాగానే ఉంది. అయితే దానిని నిర్థారించడానికి ఆధార్‌ను తప్పనిసరి చేయడం సబబుకాదని ఆయన చెప్పారు. ఆధార్ లేకపోయినా మనమంతా భారతీయులమేనని ఆయన కోర్టుకు స్పష్టం చేశారు. కాగా, ఆధార్ సమాచారం గోప్యంగానే ఉందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది కదా అని కోర్టు అడిగినపుడు, ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో సమాచార భద్రతకు ఎవరూ హామీ ఇవ్వలేరని, డేటాని వంద శాతం గోప్యంగా ఉంచడం ఎవరికీ తెలియదని ఆయన బదులిచ్చారు.

More Telugu News