Saumit kumar jena: రంగారెడ్డి జిల్లాలో ఓ ఊరినే తాకట్టు పెట్టిన మాయగాడు... ఇతని ముందు మాల్యా కూడా దిగదుడుపే!

  • కొత్వాల్ గూడ గ్రామం తాకట్టు
  • ఊరంతా తనదేనని పత్రాలు సృష్టించిన సౌమిత్ రంజన్ జెనా
  • సహకరించిన ఆయన భార్య ప్రీతి, పలువురు అధికారులు
  • సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్

సౌమిత్ రంజన్ జెనా... పదేళ్ల క్రితం లక్ష రూపాయలు ఇన్వెస్టర్ చేసి, మైనింగ్, స్టీల్, ట్రేడింగ్ వ్యాపారాలు మొదలు పెట్టిన యువకుడు. ఇప్పుడు ఇంటి ముందు ఫెరారీ, బెంట్లీ, జాగ్వార్ కార్లు, చార్టెడ్ విమానాల్లో విదేశీ ప్రయాణాలు, సినిమా, రాజకీయ ప్రముఖులతో పరిచయాలు. సామాన్యులు కలలో సైతం ఊహింలేనంత సంపద. ఈ క్రమంలో తన మోసపు మాటలే పెట్టుబడిగా, అధికారుల అండతో జెనా చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. ఓ ఊరినే తాకట్టు పెట్టిన ఘనుడు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడ గ్రామమంతా తనదేనని పత్రాలు సృష్టించి, వాటిని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి రూ. 322 కోట్లు దండుకున్నాడు.

జెనా ముందు యూబీ గ్రూప్ మాజీ చైర్మన్, లిక్కర్ కింగ్ గా ఒకప్పుడు పేరు తెచ్చుకున్న విజయ్ మాల్యా కూడా దిగదుడుపేనని చెప్పవచ్చు. ఎందుకంటే మాల్యా తన ఆస్తులను తాకట్టుపెట్టి విలాస జీవితం గడిపాడు కాబట్టి. జెనా మాత్రం ప్రజల సొమ్ముతో మహరాజులా బతికాడు. ఇతని బాగోతం బట్టబయలైన తరువాత, తమ భూములు బ్యాంకుల్లో తమకు తెలియకుండానే తాకట్టులో ఉన్నాయని తెలుసుకున్న తరువాత కొత్వాల్ గూడ గ్రామస్థులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అప్పుల కోసం ఊరినే తాకట్టు పెట్టాడని తెలుసుకున్న వారు ఉలిక్కిపడి తీవ్ర ఆందోళనతో గ్రామ పంచాయితీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. వెంటనే సౌమిత్ రంజన్ ను, ఆయన భార్య ప్రీతిని, మోసాలకు సహకరించిన వారిని, అమ్ముడుపోయిన రిజిస్ట్రార్ ను అరెస్ట్ చేసి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు

భూములన్నీ తమవేనని, 1965లో సయ్యద్ మహ్మద్ హసన్ అనే వ్యక్తి నుంచి ఈ భూములను కొన్నామని కొత్వాల్ గూడ మాజీ సర్పంచ్ కరణం కృష్ణ వెల్లడించారు. తమ వద్ద 1975 టెనెంట్ చట్టం ప్రకారం, అన్ని పత్రాలూ ఉన్నాయని హసన్ చనిపోగా, ఆయన కుమారుడు ఇప్పుడు పాకిస్థాన్ లో స్థిరపడ్డాడని చెప్పారు. ఇంత పెద్ద భూకుంభకోణం జరుగుతుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు నిప్పులు చెరుగుతున్నారు. ప్రాణాలకు తెగించి భూములను, గ్రామాన్ని కాపాడుకుంటామని అంటున్నారు.

More Telugu News