Anushka Shetty: నా గొంతు చిన్నపిల్లల మాదిరి ఉంటుంది.. అందుకే డబ్బింగ్ చెప్పను!: హీరోయిన్ అనుష్క

  • నేను మాట్లాడే మాటలు నా పక్కన వాళ్లకే వినబడవు
  • ఈ విషయాన్ని మా కుటుంబసభ్యులు చాలాసార్లు చెప్పారు
  • అందుకే, నా పాత్రలకు నేను డబ్బింగ్ చెప్పను: అనుష్క

టాలీవుడ్ లోకి కొత్తగా అడుగుపెడుతున్న హీరోయిన్లు కూడా తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్న రోజులివి. అయితే, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పదమూడేళ్లవుతున్నా తాను నటించిన  ఏ చిత్రంలోనూ అనుష్క ఇంతవరకు తన గొంతుతో డబ్బింగ్ చెప్పుకోలేదు.

‘భాగమతి’ చిత్ర విజయంతో ఆనందంలో ఉన్న అనుష్కను ఈ విషయమై ప్రశ్నించగా ... ‘నా గొంతు చిన్న పిల్లల గొంతు మాదిరి ఉంటుంది. నేను మాట్లాడే మాటలు నా పక్కనే ఉన్న వ్యక్తులకు కూడా ఒకోసారి వినిపించవు. ఈ విషయాన్ని మా కుటుంబసభ్యులు పలుసార్లు నాతో చెప్పారు. అలాంటప్పుడు, నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పుకుని, ఆ పాత్రల ప్రాధాన్యతను దెబ్బతీయలేను’ అని  చెప్పింది.

ఈ సందర్భంగా తాను నటించిన ‘అరుంధతి’ చిత్రంలోని ‘నువ్వు నన్నేం చేయలేవురా!’ అనే డైలాగ్ గురించి ఆమె ప్రస్తావించారు. ఈ డైలాగ్ కు గాత్రమే ప్రాణమని, ఈ డైలాగ్ ను ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేశానని, కానీ, ఆ స్థాయిలో చెప్పే వాయిస్ తనకు లేదని తెలిపింది. ఆమె తాజా చిత్రం ‘భాగమతి’లోని ‘ఇది భాగమతి అడ్డా’ అనే డైలాగ్ కు కూడా వాయిస్ చాలా ముఖ్యమని, అందుకు, తన గొంతు సరిపోదని అనుష్క చెప్పుకొచ్చింది. 

More Telugu News